సంక్రాంతి సంబరాల్లో నిండు తెలుగుతనం..సంక్రాంతి అంటేనే ఉత్సాహం, ఆనందం, ఐక్యత. అలాంటి పండుగను ముందుగానే గ్రామ స్థాయిలో జరుపుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. మకర సంక్రాంతిని తెలుగునాటనే కాకుండా, దేశవ్యాప్తంగా జరుపుకొంటారు.
సంక్రాంతి వేడుకలు జరుపుకోవడంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో పద్ధతి. సంక్రాంతికి ముందురోజున భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజుల్లో ముంగిళ్లలో ముగ్గులు వేయడం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగ సందేశాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పండగ సందేశం
మనకు ఎన్ని పండుగలు ఉన్నా, సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనది. సంక్రాంతి అంటేనే సందడి అనేంతగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయి. సంక్రాంతి పండుగ అనుబంధాలను పెంచుతుంది. ఈ పండుగ అనేక సందేశాలను ఇస్తుందని పెద్దలు చెబుతారు.
సంక్రాంతి శంకర అనే పదం నుంచి వచ్చిందని అంటారు. శంకర.... అంటే కదలిక అనే అర్థం. ప్రాణం ఉంటేనే కదలిక ఉంటుంది. గ్రహాల కదలిక వల్లే సృష్టి నడుస్తుంది. భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది.
మకర సంక్రాంతిలో ...మకరం....అంటే ....మొసలి.... అని అర్ధం. నీళ్లలో మొసలి పట్టుకుంటే వదలదు. సుఖాలకు అలవాటుపడిన మనిషి... మొసలి నోటిలో చిక్కుకున్న వాడితో సమానం. దాని తాలూకు బాధలనుంచి తప్పించుకోలేడు..
►ALSO READ | Sankrati Snacks special : సజ్జలతో బూరెలు.. లడ్డూలు.. జస్ట్ 20 నిమిషాల్లో రడీ.. తయారీ విధానం ఇదే..!
మనిషి కూడా ఎప్పుడూ కదలిక లేకుండా నిశ్చలంగా ఉండిపోకూడదు. జీవి కదలిక ఉత్సవం లాంటిదనే చెప్పడమే ఈ సంక్రాంతి పండుగ చెప్పే రహస్యం. ప్రస్తుతం మనుషుల జీవితాల్లో ఏదో ఒక ఆందోళన సాధారణం అయిపోయింది. జీవితంలో చెడు కానీ, మంచి కానీ చిన్న మార్పు వచ్చినా తట్టుకునే శక్తి ఉండటం లేదు. శారీరక, మానసిక రోగాల బారిన పడుతున్నారు. మనసు, శరీరాల్లో కదలిక లేకుండా ఉండే కన్నా. ఎప్పటికప్పుడు మార్పును తీసుకోగలగాలని ఈ పండుగ మనకు సందేశమిస్తుంది.
సంక్రాంతి రోజు గుడికి వెళ్లి శివుడికి అభిషేకం చేస్తారు. కొందరు నదుల్లో స్నానం చేసి, ఉపవాసం ఉంటారు. అందుకే సంక్రాంతి పండుగని శత్రువులు... మిత్రులు అనే తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకోవాలని పెద్దలు చెప్తారు
అనుబంధాల కాంతి
తాతయ్యలు, బామ్మలు 'పొద్దెక్కుతోంది.. ఇక లేవండిరా... రండి ఫ్రెష్ గా స్నానం చేయండి.. కొత్త బట్టలు వేసుకోండి .. అని పూర్వకాలంలో సంక్రాంతి పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. అమ్మా.. నాన్నలు.. అక్కాబావలు, బాబాయి పిన్ని... అందరూ ఒకదగ్గర చేరి.. ముచ్చట్లు పెడుతుంటారు. ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటారు. వాళ్ల జీవితాల్లో చిన్నప్పుడు జరిగిన సంఘటనల గురించి బోలెడు కబుర్లు చెప్పుకుంటుంటారు.
చిన్న పిల్లలంతా కొత్త బట్టలు వేసుకుని అల్లరి చేస్తుంటారు. వంటింట్లో అత్తలు.. పిన్నిలు.. అక్కలు.. బంధువులు ముచ్చట్లలో మునిగి.. నోరూరించే వంటలు చేస్తుంటారు. అందరూ కలవడం అనేదే గొప్ప ఆలోచన. ఇక అందరూ కలిసి సంతోషంగా గడిపితే.. అదే పండగ! అనుబంధాలకు సంక్రాంతి స్వచ్ఛమైన సంబురం.
సంక్రాంతి వంటలు
సంక్రాంతి రోజు పాలు పొంగిస్తారు. వాటితో పొంగలి చేస్తారు. పరమాన్నం, పులిహోర, గారెలు... వంటలు చేసుకుం టారు. పిండివంటల విషయానికి వస్తే అరిసెలు, బూరెలు, జంతికలు, సకినాలు చేసుకుంటారు. అలాగే లడ్డూలు, బూంది, మురుకులు, సేమియా పాయసం కూడా వండుకుంటారు. మన సంప్రదాయాలకు ప్రతీకలైన పండుగల్లో సంక్రాంతి ముఖ్యమైనది.
భోగభాగ్యాల తో, సిరిసంపదలను కురిపిస్తూ, కొత్తకాం తులను విరజిమ్ముతూ, కొత్తధాన్యాలతో సంక్రాంతి లక్ష్మీ అందరికీ సంతోషం పంచాలన్నదే పొంగల్ ఫెస్టివల్ ఇచ్చే మెసేజ్..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
