Nari Nari Naduma Murari Trailer: సంక్రాంతి స్పెషల్ ట్రీట్.. శర్వానంద్ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

Nari Nari Naduma Murari Trailer: సంక్రాంతి స్పెషల్ ట్రీట్.. శర్వానంద్ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

2026 సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో కొత్త సినిమాల సందడి జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే ‘రాజాసాబ్’ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వగా, రేపు జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రవితేజ, నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో సంక్రాంతి రేస్ మరింత ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు విడుదలైన సంక్రాంతి సినిమాల ట్రైలర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, ఇంకా ట్రైలర్ రిలీజ్ కాకుండా ఉన్న ఏకైక సినిమా, శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ మేకర్స్ ఇవాళ (జనవరి11న) ట్రైలర్‌ విడుదల చేశారు. 

నారి నారి నడుమ మురారి ట్రైలర్ హైలైట్స్

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో, సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఈ మూవీ ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. బుధవారం, జనవరి 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు మంచి స్పందన అందుకోగా, తాజాగా వచ్చిన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘సామజవరగమన’తో హిట్ కొట్టిన రామ్ అబ్బరాజు మరోసారి ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ట్రైలర్ స్పష్టంగా చూపిస్తోంది. ఇద్దరు కథానాయికలతో శర్వానంద్ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే వీకే నరేష్, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, సుదర్శన్ వంటి కమెడియన్లు కీలక పాత్రల్లో కనిపించి సినిమాకు హాస్య బలం చేకూర్చారు.

ఇకపోతే, ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ అందించగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందించారు. ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్తో కలిసి AK ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ‘నారి నారి నడుమ మురారి’ జనవరి 14 సాయంత్రం షోలతో థియేటర్లలో సందడి చేయనుంది.