టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కు ఫార్మాట్ మారినా దురదృష్టం అలాగే ఉంది. ఎంత బాగా ఆడినా తుది జట్టులో ఛాన్స్ దక్కించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఫ్యూచర్ స్టార్ గా.. త్రీ ఫార్మాట్ ప్లేయర్ గా పేరొందిన జైశ్వాల్ ఒక్క టెస్ట్ ఫార్మాట్ లోనే ప్లేయింగ్ లో కొనసాగుతున్నాడు. టీ20 ఫార్మాట్ లో అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు. వన్డేల్లోనూ జైశ్వాల్ ను కారణం లేకుండా తుది జట్టు నుంచి పక్కన పెడుతున్నారు. న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది.
ఈ మ్యాచ్ లో టీమిండియా హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. వడోదర వేదికగా BCA స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తోంది. తొలి వన్డేకు తుది జట్టులో జైశ్వాల్ కు స్థానం లేదు. కెప్టెన్ శుభమాన్ గిల్ గాయం నుంచి కోలుకొని జట్టులో చేరడంతో జైశ్వాల్ ప్లేయింగ్ 11లో చోటు కోల్పోనున్నాడు. టీమిండియాలో ప్రస్తుతం టాప్-5 ఫిక్సయిపోయారు. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ ఇలా ఎవరినీ జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి. ఎవరికైనా గాయం అయితే తప్ప జైశ్వాల్ కు తుది జట్టులో స్థానం దొరకడం కష్టం. టీమిండియా చివరిసారిగా సౌతాఫ్రికాతో గత నెలలో డిసెంబర్ వన్డే మ్యాచ్ ఆడింది.
తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శల పాలైన ఈ యువ క్రికెటర్ మూడో వన్డేలో అదరగొట్టాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 111 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 35 ఓవర్ రెండో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్ లో సింగిల్ తీసుకొని తన వన్డే కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు. ఆడుతున్న నాలుగు వన్డేలోనే జైశ్వాల్ సెంచరీతో ఆకట్టుకున్న ఈ ముంబై క్రికెటర్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 116 పరుగులు చేసి జైశ్వాల్ ఔటయ్యాడు.
టీ20ల్లోనూ జైశ్వాల్ కు మొండి చెయ్యి:
అంతర్జాతీయ టీ20.. ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డ్ ఉన్న జైశ్వాల్ ను వరల్డ్ కప్ కు సెలక్ట్ చేయకపోవడంతో మరోసారి అన్యాయం జరిగినట్టే కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న ఇషాన్ కిషాన్ కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చినా జైశ్వాల్ కు మాత్రం మొండి చెయ్యి చూపించారు. 2024 టీ20 వరల్డ్ కప్ లో జైశ్వాల్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బ్యాకప్ ఓపెనర్ గా ఉన్నాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరు కూడా స్టార్ ప్లేయర్స్ కావడంతో జైశ్వాల్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం లభించలేదు. రోహిత్, కోహ్లీ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించగానే ఓపెనర్ గా జైశ్వాల్ కు లైన్ క్లియర్ అయిందని భావించారు. అయితే అనూహ్యంగా అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ రేస్ లోకి వచ్చారు.
అభిషేక్ కుదురుకోవడంతో పాటు గిల్ కు అవకాశం ఇచ్చిన జట్టు యాజమాన్యం మరోసారి ఆసియా కప్ లో జైశ్వాల్ ను బ్యాకప్ ఓపెనర్ చేశారు. ఇక ఇటీవలే ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో ఏకంగా ఈ యువ ఓపెనర్ పై వేటు వేసిన సెలక్టర్లు.. వరల్డ్ కప్ కు ఎంపిక చేయకుండా షాక్ ఇచ్చారు. జైశ్వాల్ అంతర్జాతీయ టీ20 రికార్డ్ అద్భుతంగా ఉంది. 23 టీ20 మ్యాచ్ ల్లో 723 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 36 ఉండగా.. స్ట్రైక్ రేట్ 164 ఉండడం విశేషం. గిల్, కిషాన్ లాంటి ప్లేయర్లతో పోల్చుకుంటే జైశ్వాల్ కే మంచి గణాంకాలు ఉండడం విశేషం. తప్పించడానికి ఎలాంటి కారణాలు లేకపోయినా జైశ్వాల్ లాంటి అగ్రెస్సివ్ బ్యాటర్ ను పక్కనపెట్టడం అతని బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి.
