ఇండియాతో యుద్ధం చేసే దమ్ము, ధైర్యం రెండూ పాకిస్తాన్‎కు లేవు: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్

ఇండియాతో యుద్ధం చేసే దమ్ము, ధైర్యం రెండూ పాకిస్తాన్‎కు లేవు: లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్

న్యూఢిల్లీ: ఇండియాతో యుద్ధం చేసే దమ్ము, ధైర్యం రెండు పాకిస్తాన్‎కు లేవని వెస్ట్రన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ హాట్ కామెంట్ చేశారు. ఉగ్రవాదం పాకిస్తాన్ ఏకైక సాధనంగా మిగిలిపోయిందని.. ఉగ్రవాద కుట్రలతో భారతదేశంలో రక్తపాతం సృష్టించడమే దాయాది దేశ విధానమని విమర్శించారు. శనివారం (జనవరి 10) మానెక్‌షా సెంటర్‌లో జరిగిన వెస్ట్రన్ కమాండ్ ఇన్వెస్టిచర్ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కటియార్ మాట్లాడుతూ.. పశ్చిమ సరిహద్దులో సంఘర్షణకు అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. 

శాంతి కోసం శతవిధాలా ప్రయత్నం చేసిన పాకిస్తాన్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ ఎప్పటికీ ఇండియాతో స్నేహపూర్వక సంబంధాలు కోరకోదన్నారు. ఇండియాను ఎదుర్కోవడానికి పాకిస్తాన్‌కు ధైర్యం, సైనిక సామర్థ్యం రెండూ లేవని.. దీనికి బదులుగా పరోక్ష యుద్ధంపై ఆ దేశం ఆధారపడుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఉగ్రవాదం పాకిస్తాన్ రాష్ట్ర విధానంగా మారిందని దుయ్యబట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనలు ఇండియాను అస్థిరపరచడానికి పాకిస్తాన్ ప్లాన్ చేసిన కుట్రలో భాగమని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎తో పాకిస్తాన్‎కు తగిన గుణపాఠం చెప్పామన్నారు. మెరుపు వేగంతో పాక్ ఉగ్రవాద స్థావరాలు, పోస్టులు, గ్రూపులు పూర్తిగా ధ్వంసం చేశారని భారత సైనికులను అభినందించారు. 

ఈ ఎదురుదెబ్బ నుంచైనా పాకిస్తాన్ గుణపాఠం నేర్చుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య జరిగే ఏదైనా ఘర్షణను పరిమితం చేయకపోవచ్చన్నారు. ఈసారి పోరాటం పరిమితం కాదని.. ఇరువైపులా ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ తన అంతర్గత సైనిక, రాజకీయ సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కొత్త దుస్సాహసాలకు ప్రయత్నించవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మతం పేరుతో మన దేశాన్ని విభజించే కుట్ర చేస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత సైన్య ప్రధాన బలమని అన్నారు.