- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
గజ్వేల్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నాడని, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి డబ్బు సంచులు తీసుకుని వారిని రక్షిస్తున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ 5 కోట్ల ఇండ్లు కట్టించి ఇచ్చిండని, కానీ గజ్వేల్‌లో కేసీఆర్ పదేండ్లు సీఎంగా ఉండి ఒక్క ఇల్లు పేదలకు ఇవ్వలేకపోయాడన్నారు. దేశం కోసం పని చేసే బీజేపీని గల్లీ ఎలక్షన్లల్లో కూడా గెలిపించాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎలక్షన్లు పెడితేనే సెంట్రల్ ఫండ్స్ ఇస్తానని మోదీ అంటేనే రేవంత్‌రెడ్డి ఎన్నికలు పెట్టిండన్నారు.
మతాలతో సంబంధం లేకుండా అందరికీ అభివృద్ది, సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని తెలిపారు. గజ్వేల్‌లో శివాజీ విగ్రహానికి ఏంజరిగిందో? హైదరాబాద్‌లో గుడులపై ఏంజరుగుతుందో అందరికీ తెలుసని చెప్పారు. రేవంత్ రెడ్డి అండ చూసుకునే హిందువులపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో రేవంత్‌రెడ్డి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు తనతో పాటు అందరి ఫోన్లు విన్నాడని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు పెట్టి రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. రేవంత్ రెడ్డి సంచుల మోసిన కేసు కూడా ఉందని, దాని మీద కూడా సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ఫోన్ ట్యాపింగ్, కారు రేసింగ్ కేసు, అవినీతి ఇలా అన్ని కేసుల్లో రేవంత్ ఎందుకు చర్య తీసుకుంటలేడని ప్రశ్నించారు.
