ప్రజా యుద్ధానికి తలొగ్గాల్సిందే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థి, యువత విజయం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ప్రజా యుద్ధానికి తలొగ్గాల్సిందే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్యార్థి, యువత విజయం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • విద్యార్థి శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గాంధీ భవన్ లో పార్టీ కార్యకర్తల సంబురాలు 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి, యువత విజయంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ చేసిన పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా యుద్ధానికి ఎవరైనా తలొగ్గాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యంలో నియంతపోకడలకు తావులేదని, ఈ విజయానికి ప్రధాన కారణం  రాహుల్ గాంధీ పోరాటమేనని తెలిపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కోరిన విధంగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు సూచించిన రీతిలో లీకేజీలను అరికట్టడానికి ఆదర్శవంతమైన చర్చ అవసరమన్నారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, విద్యార్థులు పెట్టిన మిగతా డిమాండ్లనూ పరిష్కరించాలని మహేశ్ గౌడ్ డిమాండ్​చేశారు. 

విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గౌరవం: మంత్రులు

ఇది విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గౌరవం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది ఒక వ్యక్తి చేసిన రాజీనామా కాదని, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు  తలవంచిన సందర్భం అని పేర్కొన్నారు.  దేశంలో పారదర్శకమైన విద్యా విధానం ఆరంభం కావడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దోహదపడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు.

నీట్ అక్రమాలపై ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తి పోరాడిన ప్రతి విద్యార్థికి ఈ సందర్భంగా నా అభినందనలు అని సురేఖ పేర్కొన్నారు. దేశంలో నరేంద్ర మోదీ అప్రజాస్వామిక పాలనకు ముగింపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని యువత తిరుగుబాటుకు మోదీ సర్కార్ తలవంచక తప్పలేదన్నారు.  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని  మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్న గందరగోళానికి ఆయన రాజీనామా అద్దం పడుతుందన్నారు.

ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. కేంద్ర మంత్రి రాజీనామాతో ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరకదని, దీనిపై పార్లమెంట్ లో సమగ్రంగా చర్చ జరగాలన్నారు. రాహుల్ గాంధీ పోరాటానికి మోదీ తలవంచి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు.

ఇది విద్యార్థులు సాధించిన విజయమని, ఈ నిరసనల్లో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలన్నారు. విద్యార్థి, యువత ఉద్యమం, రాహుల్ గాంధీ రాజీలేని పోరాటం ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని విప్ బల్మూరి వెంకట్ అన్నారు.

కేంద్రంపై పోరాటంలో జెన్‌‌‌‌ జీలు వెన్నుచూపని ఉద్యమాలు స్ఫూర్తిదాయకం అని అన్నారు. విద్యార్థి, యువత ఐక్య పోరాటం, రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు వల్లే కేంద్రం ఉక్కికిబిక్కిరై ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించిందని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలకు మోదీ తలవంచక తప్పలేదన్నారు.

గాంధీ భవన్ లో సంబురాలు 

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాంగ్రెస్ క్యాడర్ గాంధీ భవన్ లో సంబురాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు గాంధీ భవన్ చేరుకొని పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని డ్యాన్స్ లు చేశారు. ఇది విద్యార్థులు సాధించిన విజయంగా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు. రాహుల్ గాంధీ రాజీలేని పోరాటానికి ప్రధాని మోదీ తలవంచక తప్పలేదని అన్నారు. రాబోయే రోజుల్లో అధికారం కాంగ్రెస్‌‌‌‌దేనని, ప్రధాని రాహుల్ గాంధీయేనని కాంగ్రెస్ నేతలు  వ్యాఖ్యానించారు.

అహంకారం ఓడిపోయిన రోజు: మంత్రి వివేక్ వెంకటస్వామి

విద్యార్థి శక్తిని తక్కువగా అంచనా వేస్తే.. అధికారం ఎంత పెద్దదైనా సరే కుప్పకూలాల్సిందేనని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యంపై యువత ఇచ్చిన తొలి రాజకీయ తీర్పు అని ప్రకటించారు. విద్యార్థుల ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ పోరాటం, ముఖ్యంగా ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ కేంద్రంపై తెచ్చిన నిరంతర ఒత్తిడితోనే కేంద్రం వెనక్కితగ్గాల్సి వచ్చిందన్నారు.

ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం అని, అహంకారం ఓడిపోయిన రోజు అని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే నేతల పదవులు పోతాయని, ప్రభుత్వాలు మారుతాయని అన్నారు. దేశ యువతను మోసం చేసిన ప్రతి నిర్ణయానికి అంతిమ తీర్పు ప్రజలదేనని అన్నారు. ప్రజల పక్షాన, విద్యార్థి, యువత భవిష్యత్తు కోసం దేశంలో కాంగ్రెస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.