హామీలు అమలు చేసేదాకా.. ధర్నా విరమించేది లేదు : ఏఎన్​ఎంలు

హామీలు అమలు చేసేదాకా.. ధర్నా విరమించేది లేదు : ఏఎన్​ఎంలు
  • కోఠి డీహెచ్ ఆఫీస్ ముందు సెకండ్ ఏఎన్​ఎంల నిరసన
  • నేడు చలో సెక్రటేరియెట్​కు పిలుపు

హైదరాబాద్, వెలుగు: సమ్మె విరమణ టైమ్​లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది సెకండ్ ఏఎన్​ఎంలు కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆవరణలో ధర్నాకు దిగారు. రెండో రోజైన శుక్రవారం పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోఠి మెయిన్ రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్​ రావు ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకట్రెండు రోజుల్లో వేతన బకాయిలు విడుదల చేస్తామన్నారు. టెక్నికల్ సమస్య కారణంగానే లేట్ అయిందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రాస్ శాలరీ ఇవ్వాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు.

ఆ విషయంపై ప్రభుత్వం కమిటీ వేసిందని.. త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తుందని ఆయన వివరించారు. అన్ని సిఫార్సులు రిపోర్ట్​లో పేర్కొంటామని డీహెచ్ హామీ ఇచ్చారు. ఈ నెల 16 వరకు టైమ్ ఇవ్వాలని కోరారు. ఇందుకు ఏఎన్ఎంలు ఒప్పుకోలేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసే దాకా ధర్నా చేస్తామని పట్టుబట్టారు. దీంతో పోలీసులు డీహెచ్​ను అక్కడి నుంచి పంపించేసి.. కొంత మంది ఏఎన్ఎంలను అరెస్ట్ చేశారు. వందలాది మంది తరలిరావడంతో చివరికి పోలీసులు కూడా చేతులెత్తేశారు. దీంతో అర్ధరాత్రి వరకు ఏఎన్ఎంలు తమ నిరసన కొనసాగించారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ధర్నా విరమించేది లేదని హెచ్చరించారు. శనివారం చలో సెక్రటేరియెట్ చేపడ్తామని ప్రకటించారు.