- దేశంలో 10 కోట్ల మంది బాధితులు
- రాష్ట్రంలో ఏటా భారీగా పెరుగుతున్న కేసులు
- 14.1 నుంచి 18 శాతం వరకు పెరుగుదల
- షుగర్రోగుల్లో 80 శాతం మందికి హైబీపీ
హైదరాబాద్ సిటీ, వెలుగు:రాష్ట్రంలో రోజు రోజుకు డయాబెటిస్పేషెంట్స్పెరుగుతున్నారు. ఏటా 14 నుంచి 18.1 శాతం వరకు మధుమేహ బాధితులు పెరుగుతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. షుగర్వ్యాధి బారిన పడిన వారు మన దేశంలో 10 కోట్ల మంది వరకు ఉన్నారని ఒక నివేదిక చెబుతున్నది. కొన్నేండ్ల కింద వరకు 40 నుంచి -50 ఏండ్లు దాటిన వారే ఈ వ్యాధి బారిన పడగా, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా దీనితో సతమతమవుతున్నారు. డయాబెటిస్ ఇతర అవయవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
దీర్ఘకాలంగా ఉన్న మధుమేహం రక్తనాళాలను దెబ్బ తీస్తున్నది. ఫలితంగా గ్యాంగ్రీన్, స్ట్రోక్, అవయవ వైకల్యం ఏర్పడుతున్నాయి. ఏటా మన దేశంలో లక్ష జనాభాలో 100 నుంచి 150 మంది బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురువుతుంటే వీరిలో 65 శాతం మంది మధుమేహ రోగులే ఉంటున్నారు. అలాగే, కిడ్నీ మార్పిడి అవసరమయ్యే రోగుల్లో ఎక్కువమంది ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారేనని తేలింది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతోనే బాధితుల సంఖ్య పెరుగుతోందన్నారు. అలాగే, కూర్చొని చేసే పనుల వల్ల మధుమేహం పెరుగుతుందని, తెలంగాణలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్ ఇతర చోట్ల ఇలాంటి ఉద్యోగులు అధికంగా ఉన్నారని, వీరికి ఎక్కువగా మధుమేహం వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్లు వద్దు..
చాలామంది ఇండ్లల్లో తినడం మానేసి బయటే తింటున్నారు. శారీరక శ్రమ తగ్గించారు. వరి, గోధుమలు ఎక్కువగా తినడం, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, స్మోకింగ్, మద్యపానం, వాకింగ్, ఎక్సర్సైజ్చేయకపోవడం వల్ల భారీగా షుగర్ పేషంట్స్ పెరుగుతున్నారు. దీనివల్ల 25 ఏండ్లకే ప్రీ -డయాబెటిక్, 30 ఏండ్లలోనే డయాబెటిస్ కేసులు నమోదవుతున్నాయి. పిల్లల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. రోజూ మనం తీసుకునే బియ్యం, గోధుమల్లో సుమారు 60 నుంచి 70 శాతం వరకు కార్బోహైడ్రేట్లు ఉంటున్నాయని, వీటిని 40 శాతానికి తగ్గించాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. 20 నుంచి 25 శాతం ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్ ఉండే ఆహారం తీసుకోవాలని, మైదా పదార్థాలను నివారించాలంటున్నారు.
డయాబెటిస్ రెండు రకాలు..
డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. టైప్ 1 డయాబెసిటిస్, జువెనైల్ డయాబెటిస్ లేదా ఇన్సులిన్ -ఆధారిత మధుమేహం అని కూడా పిలుస్తారు.శరీరంలో ఏవో తెలియని మార్పుల వల్ల పాంక్రియాస్ ప్రభావితమై, తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాక టైప్1 మధుమేహం వస్తుంది. వీరికి జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, టైప్-2 ప్రధానంగా జీవనశైలి మార్పుల వల్ల వచ్చేది. టైప్ 2 డయాబెటిస్‌లో, శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. మొదట, ప్యాంక్రియాస్ దాని కోసం అదనపు ఇన్సులిన్‌ను తయారు చేస్తుంది. కానీ, కాలక్రమేణా అది కొనసాగించలేకపోతుంది. సాధారణ రక్తంలో గ్లూకోజ్‌ని నిర్వహించడానికి తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయదు.
షుగర్పేషెంట్లలో 80 శాతం మందికి హైబీపీ
మధుమేహ బాధితుల్లో 80 శాతం మందికి రక్తపోటు ఉంటోందని డాక్టర్లంటున్నారు. ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, రక్తనాళాలు వంటి ప్రధాన్యమైన అవయవాలను దెబ్బ తీస్తుందంటున్నారు. ప్రపంచంలో ప్రతి 30 సెకన్లకోసారి డయాబెటిస్ కారణంగా ఒకరు కాలు కోల్పోతున్నారని ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. సరైన టైంలో ట్రీట్మెంట్తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చంటున్నారు.
టైప్-1 మధుమేహంపై పిల్లలకు అవగాహన
అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం, బాలల దినోత్సవం సందర్భంగా జీవీకే హెల్త్ హబ్‌లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. చిన్నతనం నుంచి టైప్–-1 మధుమేహం ఉండి, దాన్ని సక్సెస్‌ఫుల్‌గా అధిగమిస్తూ పెళ్లిళ్లు కూడా చేసుకున్న కొంతమంది..ఇప్పుడిప్పుడే దాని గురించి తెలిసి ఇబ్బంది పడుతున్న పిల్లలకు అవగాహన కల్పించారు. నాలుగైదేండ్ల వయసులో టైప్–-1 మధుమేహం ఉండి, ఏం తినాలో ఏం తినకూడదో సరిగా తెలియని పిల్లలకు తాము ఇన్నాళ్ల నుంచి దాన్ని ఎలా అధిగమిస్తున్నామన్న విషయాన్ని వివరించారు.
శుక్రవారం ఉదయం కేబీఆర్ పార్కు నుంచి జీవీకే హెల్త్ హబ్ వరకు డయాబెటిస్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీకే డయాబెటిస్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.జి. శాస్త్రి ఆధ్వర్యంలో టైప్–-1 మధుమేహానికి ఉచిత చికిత్స అందించడంతో పాటు ఉచితంగా వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
రక్తంలో చక్కెర పెరుగుదలే కాదు
డయాబెటిస్ శరీరంలోని ప్రతి అవయవ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కంటి చూపు పోవడం, నరాల సమస్య, పాదాల గాయాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం తప్పనిసరి..
– డాక్టర్ ఎంఎ ముక్సిత్ క్వాద్రి, సీనియర్ కన్సల్టెంట్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజిస్ట్, కేర్, నాంపల్లి
డయాబెటిక్స్క్రీనింగ్చేయించుకోవాలి
పిల్లల్లో కనిపించే మధుమేహం పెద్దల్లో కనిపించే దాని కంటే భిన్నం.. ముందస్తుగా గుర్తిస్తే ఇబ్బందులు ఉండవు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా డయాబెటిస్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానుకోవాలి. ఆరోగ్యంలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ కే శరత్ చంద్ర, కార్డియాలజిస్టు, ఎండీ, జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
30 శాతం మంది చిన్నవారే..
రక్తంలో హెచ్ బీఏ1సీ స్థాయి 7.0 శాతం కంటే తక్కువగా, సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ 130 ఎంఎం లోపు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ 70 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా మెయింటెన్ చేస్తే సమస్య ఉండదు. మేము చూసే డైలీ ఓపీలో 20- నుంచి 30 మంది మధుమేహ బాధితులు వస్తుండగా, వీరిలో దాదాపు 30శాతం మంది చిన్నవయసువారే ఉంటున్నారు. ఇందులో 10 నుంచి 15 ఏండ్ల మధ్య వారికి కూడా డయాబెటిస్ఉంటోంది.
– డాక్టర్ బి. శ్రావ్య, భవాని, కామినేని దవాఖాన, ఎల్బీనగర్
