టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు మరింత ముదిరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దివంగత ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత దేశ పరిపాలనలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) జోక్యం ఎక్కువైందని వార్తలు వినిపిస్తున్నాయి. దేశ పాలనా వ్యవస్థలో ఐఆర్జీసీ మితిమీరిన జోక్యాన్ని నిరసిస్తూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దేశ పాలన, కీలక నిర్ణయ ప్రక్రియల నుంచి తనను పక్కకు పెట్టారని.. దీనివల్ల తన పదవి బాధ్యతలను నిర్వర్తించడం కష్టంగా మారిందని పెజెష్కియన్ సుప్రీం లీడర్ కార్యాలయానికి తెలియజేసినట్లు ఫాక్స్ న్యూస్ కథనం ప్రచురించింది. కాగా, ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు కీలక దశలో ఉన్న వేళ ఇరాన్ ప్రెసిడెంట్ రాజీనామా వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఆ వార్తలు నిజం కాదు: ఇరాన్
అధ్యక్షుడు పెజెష్కియన్ రాజీనామా వార్తలపై ఇరాన్ స్పందించింది. పెజెష్కియన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పెజెష్కియన్ రాజీనామా చేశారని అంతర్జాతీయ మీడియాలో వస్తోన్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. పెజెష్కియన్ తన విధులను కొనసాగిస్తున్నారని స్పష్టం చేసింది. అధ్యక్షుడి కార్యాలయంలో కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ విభాగానికి డిప్యూటీ హెడ్ అయిన సయ్యద్ మెహదీ తబాతబాయి కూడా పెజెష్కియన్ రాజీనామా వార్తలను ఖండించారు. పెజెష్కియన్ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నారని.. తన బాధ్యతల నుంచి వైదొలగే ఉద్దేశం ఆయనకు లేదని ఆయన పేర్కొన్నారు.
పరిపాలనాలో ఐఆర్జీసీ జోక్యం..!
ఇరాన్ పరిపాలనా యంత్రాంగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ల పూర్తి నియంత్రణలోకి వెళ్ళిపోయాయని.. దీనివల్ల ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేకపోతోందని పెజెష్కియన్ ఆరోపించినట్లు పలు నివేదికలు వెలువడ్డాయి. కీలకమైన, అత్యంత ముఖ్యమైన విధాన నిర్ణయాల నుంచి అధ్యక్షుడు, ఆయన ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు సమాచారం. బదులుగా ఐఆర్‌జీసీలోని ముఖ్య అధికారులు దాదాపు అన్ని కీలక ప్రభుత్వ వ్యవహారాలను తమ నియంత్రణలోకి తీసుకున్నాయని, తద్వారా పౌర సంస్థల అధికారాన్ని మరింతగా క్షీణింపజేస్తున్నాయని తెలుస్తోంది.
