ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీజిల్ ట్యాంకర్.. 8 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీజిల్ ట్యాంకర్.. 8 మందికి గాయాలు
  • 25 వేల లీటర్ల డీజిల్  నేలపాలు
  • హనుమకొండ జిల్లాలో ప్రమాదం

ఆత్మకూరు  వెలుగు:  హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం జాతీయ రహదారిపై నీరుకుల్ల క్రాస్  వద్ద ఆర్టీసీ బస్సును డీజిల్ ట్యాంకర్  ఢీకొట్టింది. శుక్రవారం ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సును ములుగు వైపు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది . ట్యాంకర్  డ్రైవర్  వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా జెర్రిపోతుల వాగు మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సును అతివేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ట్యాంకర్  బోల్తా  పడడంతో 25 వేల లీటర్ల డీజిల్ వృధాగా పోయింది.

వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు డీజిల్  ట్యాంకర్​తో అగ్ని ప్రమాదం జరగవచ్చని గుర్తించి ఫైర్  సిబ్బందికి సమాచారం అందించారు. డీజిల్ ట్యాంకర్  చుట్టూ నీరు వదిలారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్, కండక్టర్  తీవ్రంగా గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సును డ్రైవర్  అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై గంటసేపు ట్రాఫిక్ జామ్  అయ్యింది. మేడారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.