ప్రైవేటుకు డిజిటల్ చెల్లింపుల బాధ్యతలు ..ఎక్స్‌‌‌‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ..ఆహ్వానించిన జీహెచ్ఎంసీ

ప్రైవేటుకు డిజిటల్ చెల్లింపుల బాధ్యతలు ..ఎక్స్‌‌‌‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ..ఆహ్వానించిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల డిజిటల్ చెల్లింపుల స్వీకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు జీహెచ్ఎంసీ రెడీ అయ్యింది. ఇప్పటివరకు ఈ చెల్లింపులను బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌‌‌‌స్పెక్టర్లు స్వీకరిస్తుండగా, స్వీకరించిన మొత్తాన్ని కొందరు ఖజానాలో జమ చేయకుండా నెల చివరి రోజు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అవకతవకలను అరికట్టేందుకు డిజిటల్ చెల్లింపుల స్వీకరణ కోసం అర్హత కలిగిన ఏజెన్సీల నుంచి ఎక్స్​ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) బిడ్లను ఈ నెల 16వ తేదీలోపు సమర్పించాలని జీహెచ్ఎంసీ నోటిఫికేషన్​జారీ చేసింది. 

చెల్లింపుల స్వీకరణకు వాట్సాప్ బిజినెస్ ప్లాట్​ఫామ్‌‌‌‌ను ఉపయోగించే సంస్థలు మెటా టెక్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌గా గుర్తింపు పొంది ఉండాలని పేర్కొంది. బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లింపులు స్వీకరించిన అనుభవం కలిగి ఉండాలని నిబంధన విధించింది. అంతేకాకుండా 24 గంటలూ చెల్లింపులను స్వీకరించి, డ్యాష్​బోర్డుపై పురోగతిని ప్రదర్శించే సామర్థ్యం ఉన్న సంస్థలు బిడ్లు సమర్పించాలని నోటిఫికేషన్​లో స్పష్టం చేసింది.