మహబూబ్‌నగర్, వెలుగు :డిండి లిఫ్టును చేపట్టడం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు పోతిరెడ్డిపాడుకు మించిన అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి గురువారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 2015, జూన్ 12న అప్పటి సీఎం కేసీఆర్ ఈ లిఫ్ట్‌కు శంకుస్థాపన చేశారని, అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామన్నారు.
ఈ పోరాటంతో స్పందించిన అప్పటి అధికార పార్టీలోని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ లిఫ్ట్‌ను రద్దు చేయాలని కేసీఆర్‌కు లేటర్లు కూడా రాశారన్నారు. కాని ఎలాంటి లాభం జరగలేదన్నారు. తాజాగా ఈ లిఫ్ట్‌తో పాలమూరుకు అన్యాయం జరుగుతుందని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, మాజీ మంత్రి జిల్లాల చిన్నారెడ్డి మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి, ఈ అన్యాయాన్ని నిలువరించాలని కోరారు.
ఇప్పటికే నల్గొండ జిల్లాకు కృష్ణా, గోదావరి, ముసీ, దుందుభీ నదుల ద్వారా నీరు అందుతోందని.. ఇందులో ఒక్క కృష్ణానది నుంచే 150 టీఎంసీలకు పైగానే వాడుకుంటున్నారన్నారు. కాని.. ఎక్కువ సాగు భూమి ఉన్న పాలమూరు జిల్లాలో 40 టీఎంసీల నీరు కూడా అందడం లేదన్నారు. డిండిని చేపడితే ఈ నీరు కూడా రాదని, వెంటనే ఈ లిఫ్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
