ఆర్‌ఎక్స్ 100, మహాసముద్రం, మంగళవారం చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు అజయ్ భూపతి. మహేష్ బాబు అన్న కొడుకు జై కృష్ణ, రవీనా టాండన్ కూతురు రాషా తడానిలను హీరోహీరోయిన్స్‌గా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ శ్రీనివాస మంగాపురం’. అశ్వినీ దత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మించారు. గురువారం సినిమా విడుదల సందర్భంగా అజయ్ భూపతి చిత్ర విశేషాల గురించి ఇలా వివరించారు.
‘‘ఇదొక ఇంటెన్స్ ఎమోషనల్ లవ్‌స్టోరీ. అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ. ప్రేమకథలు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ ఇందులో ట్రీట్‌మెంట్ అనేది కొత్తగా ఉంటుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే స్టోరీ, క్యారెక్టర్స్‌తో ఇన్వాల్వ్ అవుతారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి సర్‌ప్రైజ్ అవుతారు. రాషా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది.
ఈ జోడీని ప్రేక్షకులు ఇష్టపడతారు. దాదాపుగా సినిమా అంతా తిరుపతి, మున్నార్, హైదరాబాద్, చందేరీల్లోని ఒరిజినల్ లొకేషన్స్‌లో తీశాం. తిరుపతి టౌన్ నేపథ్యంలో జరిగే కథ. తిరుమలలో షూట్ చేయలేదు కనుక ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఈ కథకు, టైటిల్‌కు పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది. కృష్ణ గారి కుటుంబం నుంచి వస్తున్న హీరో అయినప్పటికీ నా స్టైల్‌లోనే సినిమా చేశాను. వాళ్లు కూడా నాకే వదిలేశారు. మోహన్ బాబు గారి పాత్ర సహా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. జై కృష్ణ, రాశా, మోహన్ బాబు గారు మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా హత్తుకుంటాయి.
చివరి 30 నిమిషాల ఎమోషనల్ సీన్స్ చూసి యూత్ కన్నీళ్లు పెట్టుకుంటారు. కమర్షియల్ స్పేస్‌లో ఈ సినిమా ది బెస్ట్ అవుతుంది. చాలామంది ట్రైలర్‌లో జై కృష్ణను చూశాక మహేష్ బాబులా కనిపించాడని చెప్పారు. అది ఫ్యామిలీ నుంచి వచ్చినదే. తనలో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అది సినిమాలో కనిపిస్తుంది.
మహేష్ గారు సినిమా చూసి "అదిరిపోయింది" అని మెసేజ్ పెట్టారు. జై కృష్ణ, రాషా తడానీ జంటను మెచ్చుకున్నారు. పాటలు, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని, సినిమా చాలా బాగా నచ్చిందని మెచ్చుకున్నారు. అలాగే ప్రభాస్ గారు మా సినిమా గురించి మాట్లాడటం హ్యాపీగా అనిపించింది’’.
