హైదరాబాద్, వెలుగు: రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి ఇంటికి ఫుడ్ ఆర్డర్లు భారీగా వచ్చాయి. శనివారం కొండాపూర్‌లోని ఆయన విల్లా చిరునామాకు స్విగ్గీ, జొమాటో నుంచి వందకు పైగా ఆర్డర్లు వచ్చాయి. భారీ సంఖ్యలో మెడికల్ పరికరాలు కూడా వచ్చాయి. ఇటీవల ప్రభాస్ హీరోగా రాజాసాబ్ మూవీని మారుతి డైరెక్ట్ చేశారు. అయితే, దీనికి నెగెటివ్ టాక్ వచ్చింది.
సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, అసంతృప్తి నేపథ్యంలో ప్రభాస్ అభిమానులే ఇలా చేసినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. డైరెక్టర్‌పై తమ నిరసనను వ్యక్తం చేయడానికి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో వందలాది ఆర్డర్లను పంపినట్లు తెలుస్తున్నది.
ఒక్కరోజే వంద మందికి పైగా డెలివరీ బాయ్స్ రావడంతో.. మారుతి ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వచ్చిన ప్రతి ఆర్డర్‌ను తనిఖీ చేయడం, వాటిని వెనక్కి పంపడం వారికి పెద్ద సవా లుగా మారింది. దీనిపై డైరెక్టర్ మారుతి స్పందిందించారు. ‘‘ఆ ఆర్డర్లకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. డెలివరీ సంస్థలు కూడా ఇలాంటి అనవసర ఆర్డర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి” అని కోరారు.
