జొమాటో, స్విగ్గీ డిస్కౌంట్లపై ఐటీ నజర్​

జొమాటో, స్విగ్గీ డిస్కౌంట్లపై ఐటీ నజర్​

బిజినెస్​ డెస్క్​, వెలుగు: కొత్త సంవత్సరం మొదటి నుంచి ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ కంపెనీలు  జొమాటో,  స్విగ్గీల డిస్కౌంట్ ఆఫర్లపై ఇన్​కంటాక్స్​ నిఘా పెరగనుంది.  గూడ్స్​ అండ్​ సర్వీస్​ ట్యాక్స్​ (జీఎస్​టీ) కింద ఈ స్క్రూటినీ జరగనుంది. ఎంపిక చేసిన క్రెడిట్​ లేదా డెబిట్​ కార్డులు, డిజిటల్​ వాలెట్లపై ఈ ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫామ్స్​ ఆఫర్​ చేస్తున్న కూపన్​ డిస్కౌంట్లు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వాటిని లోతుగా పరిశీలించాలనేది ఇన్​కంటాక్స్​ డిపార్ట్​మెంట్​ ఆలోచనగా ఎకనమిక్​ టైమ్స్​ రిపోర్టు చేసింది. డిస్కౌంట్లు ఇవ్వడానికి రెస్టారెంట్లు, ఫుడ్​ ప్లాట్​ఫామ్స్​ మధ్య అరేంజ్​మెంట్లపైనా ఇన్​కంటాక్స్​ డిపార్ట్​మెంట్​ దృష్టి పెట్టనుంది. జనవరి 1, 2022 నుంచి జొమాటో, స్విగ్గీలను రెస్టారెంట్లతో సమానంగా ట్రీట్​ చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్లాట్​ఫామ్స్​ డెలివరీ చేసే ఫుడ్​ విలువ మొత్తంపై 5 శాతం  జీఎస్​టీని అమలు చేయనున్నారు. 

ప్రోబ్లమ్​ ఏమిటి ....
ఫుడ్​ ప్లాట్​ఫామ్స్​పై ఆర్డరు ఇచ్చేటప్పుడు కొన్ని ఎంపిక చేసిన పేమెంట్​ పద్ధతులకు ప్రత్యేక ఆఫర్లు, మినహాయింపులను ఇస్తున్నారు. ఈ కంపెనీలు నిజానికి ఈ–కామర్స్​ ఆపరేటర్ల తరహాలోనే పనిచేస్తున్నట్లు. మనం నేరుగా రెస్టారెంట్​ నుంచి ఫుడ్ ఆర్డర్​ చేసినప్పుడు మనకి నచ్చిన విధంగా పేమెంట్ జరుపుతుంటాం. కానీ, కస్టమర్​ యూసేజ్​ని బట్టి ఆయా కార్డులు, పేమెంట్ వాలెట్లపై ఫుడ్​ ప్లాట్​ఫామ్స్​ డిస్కౌంట్​ ఆఫర్లను అందిస్తున్నాయి. కొంత మొత్తానికి మించి ఇచ్చే ఆర్డర్లపైనా, కొన్ని రెస్టారెంట్లకు ఇచ్చే ఆర్డర్లపైనా కూడా అదనపు డిస్కౌంట్లను చెల్లిస్తున్నాయి. ఫుడ్​ డెలివరీ యాప్స్​పై అమలులోకి తెచ్చే 5 % జీఎస్​టీని ఏ అమౌంట్​పై విధించాలనేది ఇప్పుడు కొత్త ప్రశ్న. ఫుడ్ అసలు విలువెంతో దాని మీద విధించాలా లేక డిస్కౌంట్ మినహాయించిన రేటు మీదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఉదాహరణకు, మనకి ఇష్టమైన రూ. 650 విలువ చేసే పిజ్జా కాంబోను ఫుడ్​ ప్లాట్​ఫామ్​పై ఆర్డరు పెట్టామనుకుందాం. ఎంపిక చేసిన పేమెంట్​ పద్ధతిలో కనక మనం పేమెంట్​ చేస్తే మనకి రూ. 100 డిస్కౌంట్​ దొరుకుతుంది. ఇప్పుడు సమస్య ఏమంటే, 5 % జీఎస్​టీ దేనిపై విధించాలి..అసలు విలువ రూ. 650 పైనా లేక డిస్కౌంట్ తర్వాత విలువ రూ. 550 పైనా..ఏ విలువపై జీఎస్​టీ విధించాలనే అంశంపై స్పష్టత లేదు. డెలివరీ బాయ్స్​కి ఇచ్చే టిప్పులు, సర్జ్​ ఫీజు, డెలివరీ ఫీజు వంటివి కస్టమర్ భరిస్తున్నాడు.  జీఎస్​టీ విధానం కింద దీన్ని ఎలా ట్రీట్​ చేయాలనేది మరో కొత్త సమస్యగా మారనుంది.