వంట నూనెలు  కల్తీ అయితున్నయ్

వంట నూనెలు  కల్తీ అయితున్నయ్
  • 10% నో క్వాలిటీ.. 2.64% సేఫ్ కాదు 
  • కల్తీనూనెల్లో ఆఫ్లాటాక్సిన్స్, 
  • ఆర్సెనిక్, మెర్క్యూరీ ఉంటున్నయ్ 
  • ఫుడ్ సేఫ్టీ అథారిటీ సర్వేలో వెల్లడి   
  • రాష్ట్రంలోనూ అడ్డగోలుగా కల్తీ.. అమలుకాని రూల్స్​ 
  • హోటళ్లు, మిల్లుల్లో తనిఖీలు చేయాలని సూచన
  • 17 శాతం నూనెలు ఊరూపేరూ లేనివే

హైదరాబాద్, వెలుగు:  వంట నూనెలు విచ్చలవిడిగా కల్తీ అవుతున్నాయి. కొన్నింటిలో ఏమాత్రం క్వాలిటీ ఉండటం లేదు. మరికొన్నింటిని వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కల్తీ వంట నూనెల్లో విషపూరితమైన ఆఫ్లాటాక్సిన్ లు, ఆరోగ్యానికి హాని చేసే హెవీ మెటల్స్ ఉంటున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్వహించిన పరీక్షల్లో తేలింది. వంట నూనెల్లో పల్లి నూనె అత్యధికంగా కల్తీ అవుతోంది. ఆ తర్వాత స్థానాలలో సోయాబీన్, రైస్ బ్రాన్, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఉన్నాయి. వంట నూనెల్లో ఏ, డీ విటమిన్లు కూడా ఉండాల్సిన స్థాయిలో లేవని వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15 రకాల ఎడిబుల్ ఆయిల్స్​పై ఎఫ్ఎస్ఎస్ఏఐ చేసిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.  
లూజ్ ఆయిల్ మరింత డేంజర్..     
నిరుడు ఆగస్టులో ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్రాలు, యూటీల్లో వంట నూనెల శాంపిల్స్ సేకరించింది. 4,461 శాంపిల్స్​ను పరీక్షించి వాటిలో క్వాలిటీ, కల్తీ, సేఫ్టీ ఏమేరకు ఉందనే దానిపై ఒక రిపోర్ట్​ను ఈ నెల 4న రిలీజ్​ చేసింది. ఎడిబుల్ ఆయిల్స్ సేఫ్టీపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. మొత్తం టెస్ట్ చేసిన శాంపిల్స్​లో 118 (2.64%​) శాంపిల్స్ అస్సలు సేఫ్ కాదని తెలిపింది. ఇలాంటి వాటిని జనాలు కొంతకాలం పాటు తింటే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించింది. మరో 453 (10.15 %)  శాంపిల్స్​లో  క్వాలిటీ లేదని పేర్కొంది. ఇక 794 (17.8%) శాంపిల్స్​లో అవి ఎక్కడ తయారు చేశారో, ఎవరు తయారు చేశారో లెక్కా, పత్రం లేదని, వాటన్నింటినీ మిస్ బ్రాండ్ కింద నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. యాసిడ్ వాల్యూ, ర్యాన్సిడిటీ, మాయిశ్చర్ కంటెంట్​లో చాలా శాంపిల్స్ ఫెయిల్​అయినట్లు పేర్కొంది. రూల్స్ ప్రకారం వ్యాపారులు లూజ్‌ ఆయిల్‌ అమ్మరాదని, కానీ యథేచ్ఛగా లూజ్‌ ఆయిల్‌ అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. లూజ్‌ ఆయిల్‌తో కల్తీ జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. 
క్యాన్సర్​తో పాటు జీర్ణ సమస్యలు 
సేఫ్టీ, క్వాలిటీ లేని వంట నూనెలతో క్యాన్సర్​ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధకం ఏర్పడతాయని అంటున్నరు. ఒళ్లు నొప్పులు, హార్ట్ ఎటాక్, పక్షవాతానికి కూడా దారితీస్తాయని చెప్తున్నరు. కల్తీ నూనెలతో లంగ్స్ దెబ్బతింటాయని, డైజెస్టివ్ సిస్టమ్‌‌ చెడిపోవడంతో పాటు గుండె సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నరు. వంట నూనెలు లూజ్ గా కాకుండా.. ప్యాకెట్ లనే తీసుకోవాలని, వాటిపై ఎక్కడ మాన్యుఫాక్చర్​ చేశారో, ఏ కంపెనీ అనే విషయాలు స్పష్టంగా చూసుకోవాలని సూచిస్తున్నరు. శరీరంలో కొవ్వు పెరిగి, గుండె సంబంధ జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉన్నందున వంట నూనెల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నరు. 
అన్ని రాష్ట్రాలు అలర్ట్ కావాలె.. 
వంట నూనెలపై రాష్ట్రాలు అలర్ట్ కావాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. తెలంగాణలోనూ కొన్ని శాంపిల్స్​లో సేఫ్టీ, క్వాలిటీ లేవని, రూల్స్ పాటించడం లేదని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచీ కల్తీ నూనెలు సప్లై అవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు మరో10 జిల్లాల్లో కల్తీ నూనెలు తయారవుతున్నాయి. వంట నూనెల రేట్లు పెరగడంతో కల్తీలు పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. కల్తీ నూనెలను అరికట్టి, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమైనట్లు పేర్కొంది. మిల్లుల్లో ఇతర నూనెలు మిక్సింగ్​ చేస్తున్నారని, వాటిపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని సూచించింది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎక్కువగా నూనెలు కల్తీ అవుతున్నాయంది. 
ప్రభుత్వాలు ఇలా చేయాలె.. 
అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఫుడ్ ఇన్​స్పెక్టర్లను నియమించుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ  సూచించింది. హోటల్స్, వంట నూనెల తయారీ, విక్రయ కేంద్రాల్లో శాంపిల్స్​ను సేకరిస్తూ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల సరిహద్దుల్లో ఎడిబుల్ ఆయిల్ సప్లైపై నిఘా ఉంచాలంది. వంట నూనెను ప్యాకెట్లుగా తయారు చేస్తున్న అక్రమార్కులు ఆ ప్యాకెట్లపై ఎలాంటి వివరాలు ఉంచడం లేదు. ఏయే రకాల నూనెలు కలిపారు. నూనె తయారు చేసిన సంస్థ వివరాలు, ప్యాకింగ్‌ చేసిన తేదీ, ప్లాంటు వివరాలు, కలిపిన కెమికల్స్ వంటి వివరాలతో కూడిన డిక్లరేషన్‌ను ప్యాకెట్లపై ముద్రించేలా చూడాలని తెలిపింది.