సుప్రీం తీర్పు మాకే అనుకూలం!..తమదే విజయమంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 

సుప్రీం తీర్పు మాకే అనుకూలం!..తమదే విజయమంటున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 
  • త్వరలో ఉప ఎన్నికలు: బీఆర్​ఎస్​ ​
  • తీర్పు ప్రజాస్వామ్య విజయమన్న కాంగ్రెస్
  • జడ్జిమెంట్​ను స్వాగతిస్తున్నామని బీజేపీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ కు సూచిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా ఈ తీర్పును ప్రధాన పార్టీలన్నీ తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ విజయం తమదే అని ప్రకటిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీల నేతలు తీర్పును స్వాగతించారు. దీంతో అసలు సుప్రీంతీర్పు ఎవరికి అనుకూలమనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఈ తీర్పును స్వాగతిస్తూ, ఇది తమ విజయం అని ప్రకటించింది.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ, ‘‘సత్యం, ధర్మం గెలిచాయి” అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇకనైనా పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే మూడు నెలల్లో ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ‘‘పాంచ్ న్యాయ్’’కు అనుగుణంగా సుప్రీం తీర్పు ఉందని, ఆయన ఈ తీర్పును స్వాగతిస్తారని కూడా కేటీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ వాదనకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఈ తీర్పును బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుగా పేర్కొంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు చెంపపెట్టు లాంటిదని అన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం వద్దని మాత్రమే సుప్రీంకోర్టు సూచించిందని, స్పీకర్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించిందని తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు నేరుగా అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ పగటి కలలు కన్నదని విమర్శించారు.

కాంగ్రెస్ ఈ తీర్పును స్వాగతిస్తుందని, ఇది ప్రజాస్వామ్య విజయం అని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పుపై బీజేపీ కూడా తనదైన శైలిలో స్పందించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్​ను స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, 2004 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఇలాగే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీజేపీ అన్ని స్థానాల్లోనూ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వాస్తవంగా చూస్తే   స్పీకర్ నిర్ణయంపైనే ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంది. స్పీకర్ అనర్హత వేటు వేయకుండా ఉండవచ్చు, అదే సమయంలో అనర్హత కూడా వేయవచ్చు అనే చర్చ జరుగుతున్నది.