- రూ.250 కోట్ల విలువైన 2.34 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్
- వివాదానికి చెక్ పెట్టిన రంగనాథ్ టీమ్
గండిపేట,వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్మండలం అత్తాపూర్ (రాంబాగ్)లో రూ.250 కోట్ల విలువ గల 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడి స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఎప్పటి నుంచో నడుస్తున్న భూ వివాదానికి హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్టీమ్చెక్పెట్టింది. వివరాల్లోకి వెళితే.. రాంబాగ్‌లోని సర్వే నంబర్ 354/1, 2, 3లో ఉన్న ఈ ఖాళీ స్థలం చుట్టూ దేవాలయాలు ఉండగా మధ్యలో ప్రభుత్వ భూమి ఉంది.
ఈ భూమికి ఆనుకుని సిక్కుల సమాధి ఉంది. ఈ భూమి మాదంటే మాదని ఇటు దేవాలయ కమిటీలు, అటు సిక్కు మతస్థులు ఎప్పటి నుంచో వాధిస్తూ వస్తున్నారు. ఇటీవల సిక్కులు హైకోర్టుకు వెళ్లగా.. మూడు నెలల్లోగా స్థలం విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని జనవరి 29న కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈలోగా సిక్కు మతస్థులు 2.34 ఎకరాల చుట్టూ టిన్ షీట్లు పెట్టి ప్రహరీ నిర్మించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
రంగంలోకి దిగిన రంగనాథ్..
ఈ భూమి గొడవ మీడియాలో రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారులతో కలిసి రికార్డులను చెక్ చేసి పక్కా ప్రభుత్వ భూమి అని తేల్చారు. వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో ఆదివారం ఉదయమే పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో హైడ్రా టీమ్ టిన్ షీట్లతో వేసిన ప్రహరీని తొలగించారు.
సిక్కుల సమాధి ఉన్న 366 గజాల స్థలాన్ని మాత్రం ముట్టుకోకుండా వదిలేశారు. మిగతా 2.34 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, ‘ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు’ అని హైడ్రా అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. చాలా ఏండ్ల నుంచి నడుస్తున్న ఈ గొడవను హైడ్రా పరిష్కరించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
