రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతికి కేటీఆరే కారణం! : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతికి కేటీఆరే కారణం! : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  •     వైట్ టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సవాల్
  •     గాంధీ భవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో  డ్రగ్స్ సంస్కృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే మూలకారకుడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. డ్రగ్స్ విషయంలో కేటీఆర్‌‌‌‌కు దమ్ముంటే వైట్ టెస్ట్ (డ్రగ్స్ టెస్ట్) చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఆదివారం గాంధీ భవన్ ఎదుట బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. 

ఈ సందర్భంగా కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఘటనతో తెలంగాణలో డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నారో మరోసారి రుజువైందని తెలిపారు. ఈగల్ టీమ్ జరిపిన తనిఖీల్లో బీఆర్ఎస్ నాయకులు డ్రగ్స్‌‌‌‌తో పట్టుబడ్డారని, దీనికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్‌‌‌‌ను పెంచి పోషించింది కేటీఆర్ కాదా?  అని ప్రశ్నించారు. 

రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే, బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు వారు కుట్రలు పన్నుతున్నారని, కానీ ‘ఈగల్ టీమ్’ తప్పు చేసిన వారిని వెంటాడి మరీ పట్టుకుంటుందని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.