2027 వన్డే వరల్డ్ కప్ మా అల్టిమేట్ గోల్.. బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకల్లో శుభ్మన్ గిల్‌‌‌‌

2027 వన్డే వరల్డ్ కప్ మా అల్టిమేట్ గోల్.. బీసీసీఐ వార్షిక  అవార్డుల వేడుకల్లో శుభ్మన్ గిల్‌‌‌‌
  • లైఫ్ టైమ్ అచీవ్‌‌‌‌మెంట్ అవార్డులు అందుకున్న ద్రవిడ్‌‌‌‌, రోజర్‌‌‌‌‌‌‌‌ బిన్నీ, మిథాలీ రాజ్‌‌‌‌
  • బెస్ట్ ప్లేయర్లుగా గిల్‌‌‌‌, మంధాన

న్యూఢిల్లీ:  సొంతగడ్డపై 2023 వన్డే  వరల్డ్ కప్‌‌‌‌లో తృటిలో చేజారిన ట్రోఫీని 2027లో ముద్దాడటమే తమ జట్టు అంతిమ లక్ష్యమని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌‌‌‌మన్ గిల్ స్పష్టం చేశాడు. గత టోర్నీలో  వరుసగా 10 విజయాలు సాధించినప్పటికీ ఫైనల్లో ఓడిపోవడం నిరాశ కలిగించిందన్న  గిల్  సౌతాఫ్రికా వేదికగా జరిగే తదుపరి టోర్నీలో ఆ లోటును భర్తీ చేస్తామని ఆదివారం జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల వేడుకలో  బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు అందుకున్న గిల్ చెప్పాడు.  

ఇక 2024 టీ20 కప్ విక్టరీ  దేశ క్రికెట్‌‌‌‌లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపిందని, ఆ విజయం అందించిన స్ఫూర్తితోనే  విమెన్స్ టీమ్,  అండర్-19 జట్లు వరుసగా ఐసీసీ టైటిళ్లను కొల్లగొట్టాయని  టీ20  కెప్టెన్ సూర్యకుమార్  అన్నాడు.  టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో హ్యాట్రిక్ సాధించడంతో పాటు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌‌‌‌  క్రికెట్‌‌‌‌లో గోల్డ్ పైనా గురి పెట్టినట్టు తెలిపాడు.

మంధాన రికార్డు

ఇండియన్ క్రికెట్ చరిత్రలో గత రెండేండ్లుగా సాగుతున్న విజయ పరంపరను గౌరవిస్తూ నిర్వహించిన  నమన్ అవార్డులు 2026 వేడుక అత్యంత వైభవంగా జరిగింది. 2024–-25 సీజన్‌‌‌‌లో అద్భుత ఆటతీరు కనబరిచిన స్టార్ బ్యాటర్లు శుభ్‌‌‌‌మన్ గిల్, స్మృతి మంధాన బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్లుగా నిలిచారు. 

ఇండియా టెస్టు, వన్డే టీమ్ కెప్టెన్  గిల్ తన కెరీర్‌‌‌‌లో రెండోసారి బెస్ట్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్నాడు. 2025 ఇంగ్లండ్ టూర్‌‌‌‌‌‌‌‌లో 754 రన్స్ చేయడంతో పాటు, చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు ఈ గౌరవం దక్కింది. ఇక అమ్మాయిల టీమ్ స్టార్ బ్యాటర్ మంధాన రికార్డు స్థాయిలో ఐదోసారి బెస్ట్ విమెన్‌ ప్లేయర్‌‌గా నిలిచింది. 2025లో వన్డేల్లో 1,362  రన్స్ సాధించిన మంధాన ఒక క్యాలెండర్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో వెయ్యి రన్స్‌‌‌‌ మార్కు దాటిన తొలి మహిళగా వరల్డ్ రికార్డు సృష్టించింది. 

మరోవైపు దేశ క్రికెట్‌‌‌‌కు దశాబ్దాల పాటు సేవలు అందించిన  లెజెండరీ ప్లేయర్లు రాహుల్ ద్రవిడ్‌, రోజర్ బిన్నీని బీసీసీఐ అత్యున్నత పురస్కారమైన కల్నల్ సీకే నాయుడు లైఫ్‌‌‌‌టైమ్‌‌‌‌ అచీవ్‌‌‌‌మెంట్ అవార్డుతో గౌరవించింది. విమెన్స్‌‌‌‌ కేటగిరీలో హైదరాబాద్ ఐకాన్ మిథాలీ రాజ్ ఈ అవార్డు అందుకుంది.  ముగ్గురికీ ఐసీసీ చైర్మన్ జై షా పురస్కారాలు అందజేశారు.సీనియర్ డొమెస్టిక్ విమెన్స్‌‌‌‌ వన్డేల్లో బెస్ట్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా షెఫాలీ వర్మ, రంజీ ట్రోఫీలో బెస్ట్  ఆల్ రౌండర్‌‌‌‌‌‌‌‌గా హర్ష్‌‌‌‌ దూబే, వైట్‌‌‌‌ బాల్‌ పోటీల్లో బెస్ట్ ఆల్ రౌండర్‌‌‌‌‌‌‌‌గా ఆయుష్ మాత్రే ఇతర అవార్డులు నెగ్గారు.

సినిమాలాంటి విజయం: శాంసన్‌‌‌‌

టీ20 వరల్డ్‌‌‌‌ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్, ఈ  విక్టరీ తనకు ఒక సినిమా లాగా అనిపిస్తోందని అన్నాడు. ‘దేశం కోసం వరల్డ్ కప్ గెలవాలనే నా కల నెరవేరింది. రాబోయే రోజుల్లో ఇండియన్ టీమ్ వరల్డ్  క్రికెట్‌‌‌‌ను శాసిస్తుంది’ అని సంజు ధీమా వ్యక్తం చేశాడు. 

ప్రతిభకు నిదర్శనం.. ఈ విజయాలు: ద్రవిడ్‌‌‌‌

మన దేశ క్రికెట్‌‌‌‌లోని అపారమైన ప్రతిభ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలుగా మారుతోందని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. గత రెండేండ్లుగా ఐసీసీ టోర్నీల్లో ఇండియా సాధిస్తున్న విజయాలు దేశంలో దశాబ్దాలుగా ఉన్న ప్రతిభకు నిదర్శనమని అన్నాడు.  ‘ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇండియన్ క్రికెట్‌‌‌‌కు ఎప్పుడూ గొప్ప సామర్థ్యం ఉంది. మైదానం బయట మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి, ఇప్పుడు గ్రౌండ్‌‌‌‌లో కూడా ఆ సామర్థ్యం విజయాల రూపంలో సాకారం కావడం చూడటం అద్భుతంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. 

 1996లో తన అరంగేట్రం నాటి నుంచి ఈ మూడు దశాబ్దాల్లో దేశ క్రికెట్ ఎదిగిన తీరును కొనియాడాడు. టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో సంజూ శాంసన్ నిజమైన సత్తాను చూడటం చాలా ఆనందంగా ఉందన్నాడు.  ఈ మెగా టోర్నీలో  ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగి ఒత్తిడిని అధిగమించి ట్రోఫీ గెలిచిన సూర్యకుమార్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టును ప్రశంసించాడు. 

 ఐసీసీ ట్రోఫీల విన్నర్లకు సత్కారం

గత రెండేండ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్స్‌‌‌‌ సాధించిన అసాధారణ విజయాలకు ఈ వేదిక సాక్ష్యంగా నిలిచింది. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, విమెన్స్‌‌‌‌ వన్డే వరల్డ్ కప్‌‌‌‌, విమెన్స్ అండర్‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన జట్లతో పాటు ఈ ఏడాది  అండర్-19 వరల్డ్ కప్‌‌‌‌,   టీ20  కప్ నెగ్గిన జట్లను బీసీసీఐ ఘనంగా సత్కరించింది. కాగా, చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ సెర్మనీకి అటెండ్ కాలేదు.