పకడ్బందీగా జనగణన..అధికారులకు కలెక్టర్ల ఆదేశం 

పకడ్బందీగా జనగణన..అధికారులకు కలెక్టర్ల ఆదేశం 
  • మే 11 నుంచి మొదటి దశ ‘హౌస్ లిస్టింగ్’
  • తొలిసారిగా డిజిటల్ విధానంలో సేకరణ

వనపర్తి/నాగర్ కర్నూల్/యాదాద్రి, వెలుగు :  దేశాభివృద్ధి ప్రణాళికలు, నియోజకవర్గాల పునర్విభజనకు కీలకమైన ‘జనగణన-2027’ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని వనపర్తి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ఆదర్శ్ సురభి, బాదావత్ సంతోష్, అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయా జిల్లాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో వారు మాట్లాడారు.15 ఏండ్ల తర్వాత జరుగుతున్న ఈ గణనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో, సెల్ఫ్ డిక్లరేషన్ సౌకర్యంతో ఈ ప్రక్రియ సాగుతుందని, సేకరించిన వివరాలు నేరుగా సర్వర్‌‌లో నిక్షిప్తమవుతాయని తెలిపారు. 1872లో ప్రారంభమైన జనగణన చరిత్రను గుర్తు చేస్తూ, క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ల నియామకం, బ్లాక్ లిస్టింగ్ పనుల్లో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మొత్తం రెండు దశల్లో జరిగే ఈ ప్రక్రియలో భాగంగా, మొదటి దశ హౌస్ లిస్టింగ్ ఈ ఏడాది మే 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగుతుందని, రెండో దశను 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

తొలి దశలో నివాస గృహాల పరిస్థితి, తాగునీరు, పారిశుధ్యం, వంటగది సౌకర్యాలతో పాటు స్మార్ట్‌‌ ఫోన్, కంప్యూటర్, వాహనాల లాంటి గృహోపకరణాలకు సంబంధించి మొత్తం 33 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరిస్తామని తెలిపారు. రెండో దశలో వ్యక్తుల వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారని, ఈ ప్రక్రియలో ప్రజల నుంచి సేకరించిన సమాచారం గోప్యంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై వాస్తవ వివరాలను వెల్లడించాలని కలెక్టర్లు కోరారు. ఈ సమావేశాల్లో అడిషనల్​ కలెక్టర్లు, ఆర్డీవోలు, సీపీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.