- బంగారం కోసం మహిళ హత్య
- ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ
- అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న ఓ మహిళ అనుమానస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. మహిళకు తెలిసిన వ్యక్తే హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలానగర్ ఏసీపీ సురేశ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గుల శివమాధవరెడ్డి(23) నగరంలోని ఎస్ఆర్ నగర్లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. బెట్టింగ్‌కు అలవాటుపడి రూ.7 లక్షలు అప్పు చేశాడు.
తన గర్ల్ ఫ్రెండ్ తల్లి వద్ద ఓ గోల్డ్ చైన్ తీసుకుని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి తేవడంతో భారీ చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన గ్రామానికి చెందిన దూరపు బంధువు ఎర్రమల్ల నిహారిక(21) జగద్గరిగుట్ట వెంకటేశ్వరనగర్‌లో నివాసముంటున్న విషయం తెలిసింది. దీంతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె వద్ద బంగారం ఉందని గమనించాడు. ఈ నెల 12న మధ్యాహ్నం నిహారిక ఇంటికి వెళ్లాడు. ఆమె భర్త డ్యూటీకి వెళ్లడంతో గొంతు నులిమి చంపేశాడు.
ఆ తరువాత ఆమె బాత్రూంలో చనిపోయినట్లు చిత్రీకరించాడు. బంగారు పుస్తెలతాడు, చెవి రింగులు, మూడు ఉంగరాలు, బెడ్రూమ్లో ఉన్న రూ.2,500 ఎత్తుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన నిహారిక భర్త దేవేందర్‌రెడ్డి తన భార్య బాత్రూమ్లో స్నానం చేస్తూ మృతిచెందినట్లు భావించాడు. దవాఖానకు తీసుకెళ్లగా డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా శివమాధవరెడ్డి హత్య చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు
