పాఫోస్ (సైప్రస్): ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఓటమి చవిచూశాడు. మంగళవారం జరిగిన ఓపెన్ సెక్షన్ ఎనిమిదో రౌండ్‌లో ప్రజ్ఞా 44 ఎత్తుల వద్ద అనీష్ గిరి (నెదర్లాండ్స్) చేతిలో కంగుతిన్నాడు. నల్ల పావులతో ఆడిన ఇండియన్ ప్లేయర్ కీలక దశలో వ్యూహాత్మక తప్పిదాలు చేశాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న అనీష్ చకచకా ఎత్తులతో గేమ్‌ను తన వైపు తిప్పుకున్నాడు. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞా, అనీష్, వీ యితో కలిసి మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.
సిందరోవ్ జావోకిర్.. ఆండ్రీ ఎసిపెంకో మధ్య జరిగిన గేమ్ 24 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. విమెన్స్ సెక్షన్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ అద్భుత విజయాన్ని అందుకుంది. అన్నా ముజిచుక్‌తో జరిగిన గేమ్‌లో 83 ఎత్తుల వద్ద నెగ్గింది. ఆర్. వైశాలి.. బిబిసారా అసాబయోవా మధ్య జరిగిన గేమ్ 74 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. ఈ రౌండ్ తర్వాత దివ్య, వైశాలి చెరో నాలుగున్నర పాయింట్లతో టాప్–2 ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
