కేంద్రం తీరుపై ఇయ్యాల ధర్నాలు చేయండి : బీఆర్‌‌ఎస్‌‌ శ్రేణులకు కేటీఆర్‌‌ పిలుపు

కేంద్రం తీరుపై ఇయ్యాల ధర్నాలు చేయండి : బీఆర్‌‌ఎస్‌‌ శ్రేణులకు కేటీఆర్‌‌ పిలుపు

హైదరాబాద్‌‌, వెలుగు: రైతులు పంట కల్లాలు నిర్మించుకునేందుకు ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నదని మంత్రి కేటీఆర్‌‌ ఆరోపించారు. పంట కల్లాల నిధులపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌‌ఎస్‌‌ శ్రేణులకు గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలు ఆరబోసుకునేందుకు కల్లాలు నిర్మిస్తే.. ఉపాధి హామీ నిధుల దారి మళ్లింపు అంటూ కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తమ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. కరోనా తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గాయని, అయినా కేంద్రం ఉపాధి హామీకి నిధులు తగ్గిస్తూ వస్తున్నదని ఆరోపించారు. పంట కల్లాలతో రైతులకు కలిగే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో అందుకు ఖర్చు చేసిన నిధులు వెనక్కి ఇచ్చేయాలని మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నదన్నారు. 

అక్కడ ఆమోదించి.. ఇక్కడ ఆంక్షలా?

సముద్ర తీర రాష్ట్రాల్లో చేపలు ఎండబెట్టేందుకు ఇదే తరహా సిమెంట్‌‌ కల్లాలు ఉపాధి హామీ నిధులతో ఆయా రాష్ట్రాలు నిర్మించాయని, వాటికి ఆమోదం తెలిపి తెలంగాణలో పంట కల్లాలపై ఆంక్షలు పెట్టడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.750 కోట్లతో 79 వేల పంట కల్లాలు నిర్మించాల్సి ఉండగా వాటిని మోడీ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. కేసీఆర్‌‌ వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు అనేక ప్రోత్సాహకాలిస్తున్నారని చెప్పారు. కేంద్రం తీరును నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో చేసే ధర్నాలకు పార్టీ శ్రేణులతో పాటు రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.