రాముడి గుడికి చందాలు ఇవ్వొద్దు

రాముడి గుడికి చందాలు ఇవ్వొద్దు

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు కామెంట్​

మనం అయోధ్యకు పోయి రాముడ్ని చూసొస్తమా?

మన ఊర్లె మనకు దేవుడు లేడా

రాముడి పేరు మీద బీజేపోళ్లు బిచ్చమెత్తుకుంటున్నరన్న ఎమ్మెల్యే

కొమురెల్లి మల్లన్న, బీరప్ప కలయికే సీఎం కేసీఆర్: తలసాని

జగిత్యాల, వెలుగు: ఎక్కడో ఉత్తరప్రదేశ్​లో రాముడి గుడి ఉంటే మనకేందని, ఆ గుడి నిర్మాణానికి చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. రాముడి పేరు మీద బీజేపీ వాళ్లు బిచ్చమెత్తుకుంటున్నారని కామెంట్​ చేశారు. ‘‘ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిన్రు. అయోధ్యలో రామమందిరం కడుతం పైసలియ్యండ్రి అంటున్నరు. మా ఊళ్లలో మేం రాముడి గుడి కట్టుకోమా..?” అని ప్రశ్నించారు. గురువారం జగిత్యాలలో గొర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అయోధ్య రామ మందిరం పేరు మీద ఆగం ఆగం చేస్తున్నారని, మన ప్రభుత్వ హయాంలో యాదాద్రిలో గుడి కట్టుకున్నామని చెప్పారు.

‘‘మనం ఉత్తరప్రదేశ్​కు పోయి రాముడ్ని చూసొస్తమా? మన ఊర్లె మనం రాముడి గుడి కట్టుకోవాలె. ఎవరికో చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనందరం భక్తులమే. మనందరికీ రాముడున్నడు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి.. రాముడి పేరు మీద బిచ్చమెత్తుకుందామని ఇయ్యాల బయలు దేరిండ్రు. అలాంటి వాళ్ల మాటలు నమ్మకండి. దేవుళ్లు ఎంతమంది ఉన్నరో వాళ్ల గుళ్లన్నీ మన ఊర్లళ్ల ఉన్నయ్. రాముడి ఆలయాలు కూడా మన ఊర్లళ్లనే ఉన్నయ్. మనమెక్కడికో ఉత్తరప్రదేశ్​ పోయి రాముడ్ని చూసొస్తమా? మన రాముడు లేడా? మనం కట్టుకుంటే మన ముంగటుండాలె గానీ.. ఉత్తరప్రదేశ్​లో ఉన్న రాముడు మనకెందుకు?”  అని ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు  అన్నారు. కులాలు, మతాల పేరిట జనం మధ్య చిచ్చు పెట్టాలని  బీజేపీ వాళ్లు చూస్తున్నారని ఆరోపించారు. ఒక ఎంపీగా ఉండి పార్లమెంటేరియన్ లాగా మాట్లాడకపోవడం మన దౌర్భాగ్యమని బీజేపీ ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లకు పెద్దలపై గౌరవం లేదు. నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతరు. కులాలు, మతాలుగా ప్రజలను విడగొట్టి, రెచ్చగొట్టాలనుకుంటరు. ప్రజలు చాలా తెలివైనోళ్లు..ఇలాంటి వాళ్లను మస్తుగా చూసిన్రు” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మల్లన్న, బీరన్న కలయికే కేసీఆర్: తలసాని

కొమురెల్లి మల్లన్న, బీరప్ప కలయికే  ముఖ్యమంత్రి కేసీఆర్​ అని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కీర్తించారు. ‘‘యాదవులు పూజించే కొమురవెల్లి మల్లన్న, కుర్మలు పూజించే బీరన్న.. ఈ ఇద్దరు దేవుళ్ల కలయికనే మన ముఖ్యమంత్రి. యాదవులు, కుర్మలు సంతోషంగా ఉన్నరు. కేసీఆర్ కుటుంబం పై మాట్లాడే నాయకులరా కేసీఆర్ కుటుంబం ఉంటేనే మీకు గుర్తింపు ఉందనే విషయం గుర్తించుకోవాలి” అంటూ వ్యాఖ్యానించారు. జగిత్యాలలో గొర్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం  రూ. 1,500 కోట్ల తో యాదాద్రిని నిర్మిస్తున్నది. మా ఇండ్లలో పూజలు ఎలా చేయాలో కూడా బీజేపీ వాళ్లు మాకు నేర్పిస్తరా? కేంద్ర ప్రభుత్వం ఒక్క  దేవాలయమైనా కట్టిందా? మీరు చెప్తెనే మేము దేవాలయాలకు వెళ్తామా?” అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ.. మీ హయాంలో జగిత్యాలలో  జరిగిన అభివృద్ధి ఎంతో, ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఎంతో పోల్చుకొని చూడు. కమీషన్ల  జాతి మీది.  మీ పార్టీ అవినీతి పార్టీ” అని విమర్శించారు. ఇటీవల తాను ఓ సభలో  మాట్లాడిన మాటలు ఎవరినీ కించపరిచేవి కావన్నారు. గంగపుత్రుల మనోభావాల ను కించపరిచేలా తాను మాట్లాడలేదని చెప్పారు.