తీన్మార్ మల్లన్నను వేధించొద్దు

తీన్మార్ మల్లన్నను వేధించొద్దు

హైదరాబాద్, వెలుగు: తీన్మార్​ మల్లన్నపై ఒకే తరహా ఆరోపణలతో వేర్వేరు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం సరికాదని హైకోర్టు తీర్పు చెప్పింది. ఒకే తరహాలో ఆరోపణలు ఉంటే ఒక కేసు నమోదు చేసి మిగిలిన వాటిని వాంగ్మూలాలుగా పరిగణించాలంటూ న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ తీర్పులో పేర్కొన్నారు. తన భర్త మల్లన్నపై ఒకే తరహా ఆరోపణలతో పలు పోలీస్‌‌ స్టేషన్లల్లో 35 కేసుల నమోదు చేశారని ఆయన భార్య కె.మమత దాఖలు చేసిన కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్‌‌పీసీ 162 కింద ఇతర ఫిర్యాదులను వాంగ్మూలంగా పరిగణించాలి. ఫిర్యాదుల్లో వాస్తవాలను పరిగణనలోకి తీసుకునేలా పోలీసులకు డీజీపీ ఆదేశాలివ్వాలి. ఒకే విధమైన ఆరోపణలు ఉంటే ఒక కేసు పెట్టి మిగిలిన వాటిని వాంగ్మూలంగా పరిగణించి వాటిని మూసేయాలి.  పీటీ వారెంట్‌‌లో అరెస్ట్‌‌ చేయాల్సివచ్చినప్పుడు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో ఇచ్చిన గైడ్‌‌లైన్స్‌‌ను అమలు చేయాలి. నిందితులకు సీఆర్‌‌పీసీ సెక్షన్‌‌ 41ఏ కింద నోటీసు ఇవ్వాలి. అర్నేష్‌‌ కుమార్‌‌ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలి. మల్లన్నను పోలీసులు వేర్వేరు పీఎస్‌‌ల్లో కేసుల పేరుతో వేధించొద్దు. తీన్మార్‌‌ మల్లన్న, ఆయన భార్య మమత పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి. పోలీసులకు తగిన సమాచారం ఇవ్వాలి. మల్లన్నపై కేసుల్లో బెయిల్‌‌ కోసం మేజిస్ట్రేట్‌‌ కోర్టులో హాజరుపర్చినప్పుడు సెక్షన్‌‌ 41 ఏ అమలు చేసింది మేజిస్ట్రేట్లు గుర్తించాకే తగిన ఉత్తర్వులు ఇవ్వాలి.. అని తీర్పులో పేర్కొంది.