- నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్గొండ, వెలుగు: నిర్ణీత నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించి, ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రం సమీపంలోని జి. చెన్నారం, ఎస్ఎల్బీసీ మార్కెట్ యార్డ్, లల్లాయిగూడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో, నిర్వాహకులతో మాట్లాడుతూ తాలు, తరుగు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే తక్షణమే కొనుగోలు చేయాలని సూచించారు. నాణ్యత ఉన్న ధాన్యాన్ని, లేని ధాన్యాన్ని కలిపి మిల్లులకు పంపవద్దని, వాటిని వేర్వేరుగా తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని, ఏవైనా సాంకేతిక ఇబ్బందులు లేదా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సెంటర్ ఇన్‌ఛార్జ్‌లను ఆదేశించారు.

