- ఇసుక తేలినా పట్టించుకోవట్లే
- వానలతో పరిస్థితి మరింత అధ్వానం
- గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్, నడుం, మెడ నొప్పులు
- సీఆర్ఎంపీ ఆలస్యంతోనూ సమస్య
హైదరాబాద్ సిటీ, వెలుగు : మూడు కార్పొరేషన్ల పరిధిలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా లొందలతో ఇసుక తేలి అస్తవ్యస్థంగా మారాయి. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. వానాకాలానికి ముందే గుంతలతో ఉన్న రోడ్లను అధికారులు పట్టించుకోలేదు. వర్షాలతో అవి మరింత పెద్దవైపోయి కష్టాలను పెంచాయి. కొన్నిచోట్ల ఇసుక బయటకు తేలడంతో వాహనదారులు స్కిడ్అయి పడిపోతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి పెద్దగా వర్షాలు కురవలేదు. నాలుగు రోజుల కిందటే వానలు మొదలుకాగా, ఈ ఒక్క వానకే రోడ్ల అసలు రంగు బయటపడింది. రోడ్లపై లొందలతో కోర్‌సిటీతో పాటు ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్సమస్య తలెత్తుతున్నది. రోజూ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్స్‌కు వెళ్లే స్టూడెంట్స్టైంకు రీచ్కాలేకపోతున్నారు. మరోవైపు వాహనాల మెయింటనెన్స్ఖర్చు కూడా పెరిగిపోతోంది. టైర్లు, సస్పెన్షన్, వీల్ అలైన్‌మెంట్, షాక్ అబ్జర్బర్లు దెబ్బతింటున్నాయి. తరచూ బ్రేకులు వేయడం, లొందలను తప్పించేందుకు వాహనాలను మలుపులు తిప్పాల్సి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. టూ వీలర్లు నడిపే వారికి వెన్నునొప్పి, మెడనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
అంతటా అదే పరిస్థితి...
ఒక్క చోట అని కాకుండా సిటీ అంతా గుంతల సమస్య ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, ఉప్పల్, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. వర్షపు నీటితో అవి నిండిపోవడంతో గుంతల లోతు అంచనా వేయడం కష్టమై వాహనదారులు కిందపడి గాయపడుతున్నారు. టూవీలర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్కూల్ బస్సులు, అంబులెన్స్‌ల వంటి అత్యవసర సేవల వాహనాలు నడిపేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
రాయదుర్గంలో డేంజర్
రాయదుర్గం సర్కిల్ వద్ద కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, దెబ్బతిన్న రోడ్లు, వర్షపు నీటి నిల్వలు కలిసి ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి, మైండ్‌స్పేస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే రూట్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోంది. సాధారణంగా అరగంటలో ఆఫీసులకు చేరాల్సి ఉండగా, ఇప్పుడు గంటన్నర నుంచి 2 గంటలు పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరేందుకు కూడా రెండు గంటలు పడుతోందని, ఇలా రోజుకు నాలుగ్గంటల పాటు రోడ్లపైనే గడపాల్సి వస్తోందని వాపోతున్నారు.
సీఆర్ఎంపీ ఆలస్యంతోనూ సమస్య
సిటీలో మెయిన్‌రోడ్ల నిర్వహణ కోసం ‘కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్’ (సీఆర్ఎంపీ) రెండో విడతను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని ప్రకారం రూ.3145 కోట్లతో 1014 కిలోమీటర్ల పొడువున రోడ్ల నిర్వహణ బాధ్యతలను పదేండ్ల పాటు ఏజెన్సీలకు అప్పగించాలని జీహెచ్ఎంసీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే నేటికీ టెండర్లే పూర్తి కాలేదు. వర్షాకాలానికి ముందే ఈ టెండర్లు పూర్తి చేసి ఉంటే ఏజెన్సీలే చూసుకునేవి. ఇప్పుడు రోడ్లు దెబ్బతినడంతో ఎలాగూ ఏజెన్సీలకు అప్పగిస్తాం కదా అని పట్టించుకోవడం లేదు. అప్పటిదాకా ఆగకుండా ముందు రోడ్లపై భారీగా తేలిన గుంతలను యుద్ధప్రాతిపదకన రిపేర్చేయాలని, అవసరమైన చోట తాత్కాలిక ప్యాచ్‌వర్క్‌తో సరిపెట్టకుండా క్వాలిటీ రోడ్లు నిర్మించాలని నగరవాసులు కోరుతున్నారు.
