సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్  లో అసలేం జరిగిందంటే..? 

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్  లో అసలేం జరిగిందంటే..? 

హైదరాబాద్ : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో గాయపడ్డ వారికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ ఇద్దరికి పెద్దగా గాయాలు కాకపోవడంతో వారిని ఇంటికి పంపించారు. మిగతా వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. చికిత్స తీసుకుంటున్న వారిలో కానిస్టేబుల్ శ్రీకాంత్, ఒకరు ఫైర్ సిబ్బంది, నలుగురు మహిళలు, ఒక యువకుడు.. మొత్తం ఏడుగురు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారికి వారం పాటు ట్రీట్మెంట్ అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

టికెట్స్ కౌంటర్లు మూసివేత
జింఖానా గ్రౌండ్ లో టికెట్స్ కౌంటర్లను మూసివేశారు. టిక్కెట్ల కోసం వేచి ఉన్న ఫ్యాన్స్ ను పోలీసులు పంపించి వేశారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు టిక్కెట్లను ఆన్ లైన్ లో పెడుతామని HCA అధికారులు చెప్పారు. ఇవాళ ఒక్కరోజు ఆఫ్ లైన్ లో సుమారు 3 వేల టికెట్స్ ను అమ్మారు. 

అసలేం జరిగిందంటే..?
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో ఉద్రికత్త నెలకొంది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. టికెట్ల కోసం వేలాదిగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన తోపులాటలో పలువురు యువతులు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని వెంటనే సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. 

తొక్కిసలాటలో పలువురికి గాయాలు
ఈనెల 25వ తేదీన ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-, ఆసీస్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో టికెట్ల అమ్మకాల కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు విక్రయిస్తున్నారు. మ్యాచ్‌ టికెట్ల కోసం ఉదయం నుంచే అభిమానులు బారులు తీరారు. టికెట్ల కొనుక్కునేందుకు ప్యారడైజ్‌ సర్కిల్ నుంచి జింఖానా వరకు క్యూలైన్‌ ఏర్పాటు చేశారు.

అంచనాలకు మించి వేలాదిగా క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు చాలా అవస్థలు పడ్డారు. ఉదయం నుంచే టికెట్స్ అమ్ముతున్నప్పటికీ.. బాగా ఆలస్యం జరుగుతుండటంతో అభిమానలు ఆగ్రహంతో ఊగిపోయారు. టికెట్స్ దొరుకుతాయో లేదోననే టెన్షన్.. కౌంటర్ బంద్ చేస్తారంటూ జరిగిన ప్రచారం, కేవలం 800, 1200 రూపాయల టికెట్స్ మాత్రమే అమ్మడంతో అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగింది. దీంతో అంతా ఒక్కసారిగా కౌంటర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. మెయిన్‌ గేట్‌ వైపు నుంచి ఒక్కసారిగా తోసుకుని రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో తొక్కిసలాట జరిగింది. 

హెచ్‌సీఏ తీరుపై విమర్శలు
టికెట్ల విక్రయాలకు జింఖానా గ్రౌండ్ లో ఒకటే కౌంటర్ ఏర్పాటు చేశారు. టికెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని పలువురు అభిమానులు మండిపడుతున్నారు. హెచ్‌సీఏ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌కు సంబంధించిన పాస్‌ల జారీ కూడా గందరగోళంగా మారడంతో హెచ్‌సీఏపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

హెచ్సీఏ తప్పిదం వల్లే..
హెచ్సీఏ తప్పిదం వల్లే తొక్కిసలాట జరిగిందని, సరైన ఏర్పాట్లు చేయలేదని అడిషనల్ కమిషనర్ చౌహాన్ చెప్పారు. తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని, గాయపడ్డ వారు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ 
జింఖానా గ్రౌండ్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్రికెట్ టికెట్ల గందరగోళంపై మధ్యాహ్నం 3 గంటలకు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులు తన కార్యాలయానికి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయి..? ఎన్ని ఆన్లైన్లో పెట్టారు..? ఎంతమందికి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారు..? అనే సమాచారంతో రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టిక్కెట్ల అమ్మకాలపై నిఘా పెట్టామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మ్యాచ్ డేట్ ఫిక్స్ అయినప్పుడే HCA ఏర్పాటు చేసుకోవాలని, టిక్కెట్ల అమ్మకాల విషయంలో HCA వైఫల్యం పూర్తిగా ఉందన్నారు. ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని HCA ప్రతినిధులెవరూ సంప్రదించలేదన్నారు. తప్పు జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. HCA  వ్యవహారంపై ఒక కమిటీ వేస్తామన్నారు. టికెట్స్ అమ్మకాలపై  HCA హడావుడి నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డారు.