- ప్రపంచంలోనే ఇది మొదటిసారి అని ప్రకటన
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. రోబోటిక్ సర్జరీతో కిడ్నీ మార్పిడీ చేసి రికార్డు సృష్టించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి.సూర్యప్రకాశ్ వెల్లడించారు. నల్లగొండ జిల్లాకు చెందిన రంగారెడ్డి(45) వనస్థలిపురంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు.
ఆయనకు హైబీపీ ఉండగా, కేర్లెస్ చేయడంతో రెండు కిడ్నీలు పాడయ్యాయి. కొన్నాళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ కిడ్నీ మార్పిడీ కోసం ప్రయత్నించాడు. జీవన్‌దాన్ లో పేరు నమోదు చేసుకోగా కిడ్నీ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్‌ను సంప్రదించాడు. సాధారణ శస్త్రచికిత్సలో అయితే పెద్ద కోత పెట్టాల్సి రావడం, ఇతర సమస్యలు ఉంటాయని డాక్టర్లు భావించారు.
సీఎంఆర్ సర్జికల్ రోబోతో సులువుగా కిడ్నీ మార్పిడీ చేశారు. రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి అని డాక్టర్లు ప్రకటించారు. ఈ పద్ధతి వల్ల చిన్న కోత, కణజాలాలకు తక్కువ నష్టం, తక్కువ రక్తస్రావం, కచ్చితత్వం, వేగంగా కోలుకోవడం, తక్కువ నొప్పి వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.
