- ఒకరికి రావాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మరొకరికి
- తప్పు గుర్తించి సెలెక్షన్ లిస్ట్ సవరించిన మెడికల్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల (అనస్థీషియా) నియామక ప్రక్రియలో అధికారులు చేసిన చిన్న తప్పు గందరగోళాన్ని సృష్టించింది. వెయిటేజీ పాయింట్ల లెక్కింపులో పొరపాటు జరగడంతో ఓ మహిళా అభ్యర్థి ఎంపికను రద్దు చేస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అభ్యర్థి స్థానంలో మరో అభ్యర్థిని ఎంపిక చేస్తూ గురువారం వెబ్ నోట్ విడుదల చేసింది.
ఈ నెల 4న అనస్థీషియా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెలెక్షన్ లిస్ట్‌ను బోర్డు ప్రకటించింది. ఇందులో ఓ అభ్యర్థినికి 1822 రోజుల అనుభవం ఉన్నట్లుగా పరిగణించి, పొరపాటున 20 వెయిటేజీ పాయింట్లు కేటాయించారు. ఇదే అభ్యర్థినికి టీవీవీపీ సీఏఎస్ రిక్రూట్‌మెంట్‌లో 12 పాయింట్లు మాత్రమే రావడంతో గందరగోళం ఏర్పడింది. ఒకే అభ్యర్థినికి రెండు వేర్వేరు రిక్రూట్‌మెంట్లలో వేర్వేరు పాయింట్లు ఎలా వచ్చాయనే దానిపై బోర్డు విచారణ చేపట్టింది.
ఈ పునఃపరిశీలనలో క్యాండిడేట్ కు కేవలం 1096 రోజుల అనుభవం మాత్రమే ఉన్నట్లు తేలింది. రూల్స్ ప్రకారం.. ఆమెకు 20 పాయింట్లకు బదులు 12 పాయింట్లు మాత్రమే రావాలి. పాయింట్ల సవరణ తర్వాత ఆమె ర్యాంకు ఒక్కసారిగా 24వ స్థానం నుంచి 140కి పడిపోయింది. ర్యాంకు భారీగా తగ్గడంతో అభ్యర్థి సెలెక్షన్‌ను బోర్డు రద్దు చేసింది. ఆమె స్థానంలో మెరిట్ లిస్ట్‌లో తర్వాతి స్థానంలో (ర్యాంక్ 29) ఉన్న డాక్టర్ పెరుమాండ్ల కవితను ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది. బీసీ-బి కేటగిరీ కింద కవితను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపిక చేస్తూ బోర్డు మెరిట్ లిస్ట్‌లో మార్పులు చేసింది.
