ఇంట్లో ఉన్నా వడదెబ్బ.. ఈ జాగ్రత్తలు పాటించండి

ఇంట్లో ఉన్నా వడదెబ్బ.. ఈ జాగ్రత్తలు పాటించండి

ఎండాకాలంలో చాలామందిని ఇబ్బందిపెట్టే ఆరోగ్య సమస్యల్లో  సన్​స్ట్రోక్ (వడదెబ్బ)  ముఖ్యమైంది. ఎండలో ఎక్కువ సేపు ఉన్నప్పుడు, నీళ్లు సరిపడా తాగనప్పుడు మాత్రమే వడదెబ్బ తగులుతుంది  అనుకుంటారు చాలామంది. అయితే, రోజంతా ఇంట్లోనే ఉండేవాళ్లు కూడా వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇంట్లోని వేడి వాతావరణమే అందుకు కారణం అంటున్నారు డాక్టర్లు. ఈ సీజన్​లో ఆరోగ్యాన్ని కాపాడు కునేందుకు ఫిజీషియన్లు చెప్తున్న సలహాలివి. 

మామూలుగా అయితే,  శరీరంలో నీళ్లు తగ్గిపోవడం, ఎండలో తిరగడం, వేడివాతావరణంలో ఉండడం వల్ల వడదెబ్బ తగులుతుంది. అయితే, ఇంట్లో ఉండేవాళ్లు ‘ఎండలో బయటకి వెళ్లట్లేదు కదా’ అని నీళ్లు సరిపడా తాగరు. కొందరు నూనె, ఫ్యాట్​ పుడ్ ఎక్కువ తింటారు. ఇంట్లో పొద్దంతా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. కొద్ది సేపయ్యాక గది మొత్తం వేడిగాలితో నిండుతుంది. మామూలుగా 25 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉండాల్సిన గది టెంపరేచర్​ 40 డిగ్రీలకు చేరుతుంది.  దాంతో, గదిలో ఉన్నవాళ్ల  శరీర టెంపరేచర్​ కూడా పెరుగుతుంది. శరీరాన్ని చల్లబరచడం కోసం నీళ్లు బయటకు పోతాయి. దీంతో  వడదెబ్బ లక్షణాలైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట  కనిపిస్తాయి.  

వీళ్లకు రిస్క్​

పిల్లలు, పెద్దవాళ్లు, అనారోగ్యంతో మంచానపడ్డవాళ్లపై ఇంట్లో వేడి ప్రభావం ఎక్కువ. ఎందుకంటే.... వీళ్లు టైంకి నీళ్లు తాగరు. ఎండలో ఆడడం వల్ల  శరీరంలో నీళ్లు తగ్గిపోయి పిల్లలు నీరసంగా కనిపిస్తారు. పెద్దవాళ్లకు తొందరగా దాహం వేయదు. కారణం వయసు ప్రభావం వల్ల వీళ్లలో జీవక్రియలు నెమ్మదిగా జరుగుతాయి. ఎవరో ఒకరు నీళ్లు తాగిస్తే తప్ప,  మంచం పట్టినవాళ్లు నీళ్లు కావాలని అడగలేరు.  అందుకని పిల్లలు, పెద్దవాళ్లు, మంచం పట్టిన వాళ్లను  వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. గుండె జబ్బులతో బాధపడేవాళ్లు కూడా తొందరగా డీహైడ్రేట్ అవుతారు. కారణం... వీళ్లు  డైయురెటిక్ ట్యాబ్లెట్లు వాడతారు. దాంతో,   మూత్రం రూపంలో నీళ్లు బయటకు పోతాయి. 

ఈ జాగ్రత్తలు పాటించాలి 

ఎండాకాలంలో గాలి సరిగా ఆడని, ఇరుకు గదుల్లో ఎక్కువసేపు ఉండొద్దు. చల్లదనం కోసం కూలర్లు వాడాలి. నీళ్లు బాగా తాగాలి. ఆల్కహాల్, కెఫిన్​ ఉన్న డ్రింక్స్ తాగొద్దు. ఎక్కువ తీపి, ఉప్పు ఉన్న ఫుడ్​ తినొద్దు. వదులుగా ఉండే  కాటన్ దుస్తులు వేసుకోవాలి. కిచెన్​లో వంట చేసేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్​లో ఉంచితే వేడిగాలి బయటికి పోతుంది. గది టెంపరేచర్​ 28 డిగ్రీల సెల్సియస్​ ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే సన్​స్ట్రోక్​ రాదు.