కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..బడ్జెట్​లో 15% మైనార్టీలకే

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..బడ్జెట్​లో 15%  మైనార్టీలకే
  •     యూపీఏ హయాంలో ఆ పార్టీ ప్రపోజల్ పెట్టింది : మోదీ
  •     బీజేపీ వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది 
  •     ఇప్పుడు మళ్లీ ఈ ప్రపోజల్ తేవాలని భావిస్తోంది   
  •     ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల హక్కులను ముస్లింలకు కట్టబెడతది
  •     పేదల హక్కులకు తాను చౌకీదార్ గా ఉంటానని వెల్లడి

నాశిక్(మహారాష్ట్ర) : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బడ్జెట్​లో 15 శాతాన్ని మైనార్టీలకు కేటాయించాలని ఆ పార్టీ యోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ ప్రపోజల్ ను తెచ్చిందని, కానీ బీజేపీ వ్యతిరేకించడంతో అది అమలు కాలేదన్నారు. ఇప్పుడు మరోసారి ఈ ప్రపోజల్​ను ముందుకు తేవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందన్నారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను తాను ఎన్నటికీ అనుమతించబోనని స్పష్టం చేశారు.

బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా పింపల్ గావ్ బస్వంత్ వద్ద మహాయుతి కూటమి అభ్యర్థులు భారతి పవార్ (బీజేపీ), హేమంత్ గాడ్సే (శివసేన)కు మద్దతుగా జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. మత ప్రాతిపదికన బడ్జెట్​ను విభజించడం అనేది ప్రమాదకరమని అన్నారు. “మతం ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించడానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా వ్యతిరేకం.

కానీ కాంగ్రెస్ మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ హక్కులను లాక్కుని ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోంది. సమాజంలోని అణగారిన వర్గాల హక్కులకు మోదీ చౌకీదార్ (కాపలాదారు)గా ఉంటారు. పేదల హక్కులను కాంగ్రెస్ ఎన్నటికీ లాక్కోనివ్వబోడు” అని ప్రధాని  చెప్పారు.

మతాలకు అతీతంగా స్కీంలు అమలు చేశాం.. 

దేశం కోసం దృఢమైన నిర్ణయాలు తీసుకునే ప్రధానిని ఎన్నుకోవడం కోసమే ప్రస్తుత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని మోదీ అన్నారు. గత పదేండ్లలో తన ప్రభుత్వం మతాలకు అతీతంగా పేదలందరికీ ఉచిత బియ్యం, నీళ్లు, కరెంట్, ఇండ్లు, గ్యాస్ కనెక్షన్లను ఇచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందించిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోబోతోందని మహారాష్ట్రలోని ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ అయిన ఓ నేతకు తెలిసిపోయిందని ఎన్ సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ ను ఉద్దేశించి మోదీ పరోక్షంగా కామెంట్ చేశారు.

అందుకే ఆయన చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్ లో విలీనం కావాలని, అప్పుడే కాంగ్రెస్ కనీసం ప్రతిపక్ష పార్టీగా అయినా నిలబడుతుందని చెప్పారన్నారు. ఒకవేళ డూప్లికేట్ శివసేన (శివసేన యూబీటీ) కాంగ్రెస్​లో కలిస్తే గనక.. బాలాసాహెబ్ థాక్రే కలలుగన్న రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు అంశాలను తాను గుర్తు చేసుకుంటానని చెప్పారు.  

హిందూ, ముస్లిం అని ఎప్పుడూ మాట్లాడలే.. 

హిందూ, ముస్లిం అని తాను ఎప్పుడూ మాట్లాడలేదని, అలా మాట్లాడిన రోజు ప్రజా జీవితంలో ఉండేందుకు అనర్హుడిని అవుతానని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కువ మంది సంతానం ఉన్నవాళ్లు అని అంటే.. ముస్లింల గురించే అని ఎలా అనుకుంటారు? పేద కుటుంబాలకూ ఇది వర్తిస్తుంది కదా? మతం ఏదైనా.. పేదరికంలో ఉన్నవాళ్లకు ఎక్కువ మంది పిల్లలు భారమే అవుతారు. అంతే తప్ప నేను హిందూ, ముస్లిం అని ఎక్కడా చెప్పలేదు. పోషించగలిగే శక్తిని బట్టే ఎంత మంది పిల్లలను కనాలో నిర్ణయించుకోవాలి అని మాత్రమే చెప్పాను” అని స్పష్టం చేశారు.

తాను ఎన్నడూ ఓటు బ్యాంకు కోసం పని చేయనని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న సూత్రాన్నే నమ్ముతానన్నారు. 2002 నాటి గోధ్రా అల్లర్ల తర్వాత తన ప్రత్యర్థులు కావాలనే తన ఇమేజ్​ను దెబ్బతీశారని మోదీ ఆరోపించారు. చిన్నప్పటి నుంచి తనకు ముస్లింలతో అనుబంధం ఉందన్నారు. ముస్లిం పండుగలకు వెళ్లేవాడినని, తనకు ఇప్పటికీ ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారన్నారు.