తెలంగాణలో కొత్త బైక్ గానీ, స్కూటీ గానీ కొంటే ఈ రూ.2 వేలు కట్టాల్సిందే..!

తెలంగాణలో కొత్త బైక్ గానీ, స్కూటీ గానీ కొంటే ఈ రూ.2 వేలు కట్టాల్సిందే..!

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారిపై ‘రోడ్ సేఫ్టీ’ సెస్ అమలు చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.

శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసేందుకే ఈ సెస్ విధిస్తున్నామని, ఇది కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

కొత్తగా కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, లైట్ మోటార్ వెహికల్స్ (కార్లు)కు రూ.5 వేలు, హెవీ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు రూ.10 వేల చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయనున్నారు. ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఈ సెస్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. 

ఇప్పటికే కర్ణాటక, కేరళ సహా పలు రాష్ట్రాల్లో కొత్త వాహనాలు తొలి సారి రిజిస్ట్రేషన్‌ చేసే సమయంలోనే  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘రోడ్ సేఫ్టీ’ సెస్ను ఆ రాష్ట్రాలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.