అతివలదే పైచేయి.. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళలు,సంగారెడ్డిలో పురుషులు అధికం

అతివలదే పైచేయి.. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళలు,సంగారెడ్డిలో పురుషులు అధికం
  • మహిళా ఓట్లపై ఆశావహుల చూపు 

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా మారిన మహిళ ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లో సైతం కీలకంగా మారనున్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉంటే సంగారెడ్డి జిల్లాలో మాత్రం పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి  జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో 5,43,103 మంది ఓటర్లు ఉండగా అందులో 2,69,432 మంది పురుషులు, 2,73,219 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 3787 మంది అధికంగా ఉన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో నాలుగేసి మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో 400 వార్డులు ఉండగా ఆయా స్థానాల్లో మహిళా ఓట్లు కీలకంగా మారనున్నాయి. 

పెరగనున్న మహిళల ప్రాతినిధ్యం 

గతంతో పోలిస్తే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటివరకు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించకపోయినా కనీసం సగం చైర్మన్ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 400 మున్సిపల్ వార్డులు ఉండగా ఈసారి 150 స్థానాల్లో మహిళలు గెలిచే అవకాశం ఉంది.

సంగారెడ్డిలో భిన్న పరిస్థితి 

సంగారెడ్డి జిల్లాలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉండగా అందులో మహిళల కంటే పురుష ఓటర్లు 2360 మంది అధికంగా ఉన్నారు. ఆరు మున్సిపాలిటీల్లో మహిళలు ఐదింట్లో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.

మహిళా ఓటర్ల వైపు అభ్యర్థుల చూపు 

మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేద్దామనుకుంటున్న ఆశావహులు ఇప్పుడు మహిళా ఓటర్ల వైపు చూస్తున్నారు. ఆయా వార్డుల్లో గెలుపోటములను శాసించే పరిస్థితుల్లో మహిళా ఓటర్లు ఉండడంతో ఆశావహులు వారి మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా వార్డుల్లోని మహిళా సంఘాల మద్దతును పొందడం కోసం ఆఫర్లు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు ఆశావహులు గ్రైండర్లు, కుట్టుమిషన్లు, ఇతర వంట సామగ్రిని మహిళలకు పంపిణీ చేసి వారి ఓట్లను పొందాలని ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య

జిల్లా     మొత్తం ఓటర్లు    పురుషులు    మహిళలు 

సిద్దిపేట    10,1090    48,965    52,111

మెదక్    87,615    42,306    45,307 

సంగారెడ్డి    35,4398    17,8161    17,5801

మొత్తం    54,3103    26,9432    27,3219