బాలల భవిష్యత్తుకు భరోసా.. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 12 స్టార్ట్

బాలల భవిష్యత్తుకు భరోసా.. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 12 స్టార్ట్
  • ఈ నెలాఖరు వరకు స్పెషల్ డ్రైవ్
  • నిరుడు 196 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించిన పోలీసులు
  • పిల్లలను పనిలో పెట్టుకున్న 16 మంది యజమానుల అరెస్ట్

మంచిర్యాల, వెలుగు:  చదువుకునే వయసులో పలువురు చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ స్కూళ్లు , కాలేజీలకు వెళ్లాల్సిన వాళ్లు కార్ఖనాల బాట పడుతున్నారు. పసిప్రాయంలోనే రెక్కలు ముక్కలు చేసుకుంటూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్న వారెందరో. అలాంటి బాలలను గుర్తించి, పని నుంచి విముక్తి కల్పించి వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు పోలీసులు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన ఆపరేషన్ స్మైల్ 12 ప్రోగ్రాం ఈనెల ఒకటిన మొదలైంది.  ఇందులో భాగంగా నెలాఖరు వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.

వివిధ శాఖల సమన్వయంతో.... 

ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం విజయవంతం కోసం జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యుసీ), లేబర్, హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో డీసీపీ ఏ.భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కొ ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.

జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో 18 సంవత్సరాల లోపు బాలబాలికలు పనిలో ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే బాలకార్మికులు, భిక్షాటనలో ఉన్న పిల్లలు, వదిలివేయబడ్డ పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.  బలవంతంగా భిక్షాటన, వెట్టిచాకిరి చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. 

సబ్ డివిజన్ కు ఒక కమిటీ... 

మంచిర్యాల జిల్లాలో మూడు పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక ఎస్సై స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో నలుగురు సిబ్బంది, ఒక లేడీ కానిస్టేబుల్‌ను నియమించారు. వీరు హోటల్స్, షాపులు, మెకానిక్ షెడ్లు, వివిధ ఇండస్ట్రీల్లో పనిచేస్తున్న, భిక్షాటన చేస్తున్న బాలబాలికల సమాచారాన్ని సేకరించి వారిని గుర్తిస్తారు. ఈ సమాచారాన్ని పోలీస్ కమిషనరేట్ స్థాయిలో సమగ్రంగా సమీకరించి, హైదరాబాద్‌లోని మహిళా భద్రతా విభాగం అధికారులకు అందజేస్తారు. 

నిరుడు 196 మందికి విముక్తి.... 

ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ప్రోగ్రాంలో గత సంవత్సరం 196 మంది బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. వారిని స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించారు. పిల్లలను పనిలో పెడుతున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అందులో 139 మంది బాలురు, 57 మంది బాలికలు ఉన్నారు. చిన్నారులను పనుల్లో పెట్టుకొన్న యజమానులపై 13 కేసులు నమోదు చేసి 16 మందిని అరెస్ట్ చేశారు.

ఆపరేషన్ స్మైల్ సక్సెస్ చేయాలి... 

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ప్రజలు సహకరించాలి. తమ పరిసరాల్లో తప్పిపోయిన బాలబాలికలు, బాలకార్మికుల సమాచారాని పోలీసులకు తెలియజేయాలి.

తల్లిదండ్రులు తమ పిల్లలను పనిలో పెట్టి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేయొద్దు. వివిధ షాపుల యజమానులు సైతం చిన్నారులను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి. - డీసీపీ ఏ. భాస్కర్, మంచిర్యాల