సోలార్ పవర్ వల్ల ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికి మేలు కలుగుతుంది... అయినా సోలార్ ప్యానెల్స్‌ని బిగించుకునేందుకు సరిపడా ప్లేస్ లేక చాలామంది వెనకడుగు వేస్తున్నారు. అలాంటివాళ్ల కోసమే. గుజరాత్‌కు చెందిన ఇంజనీర్ శని పాండ్య సోలార్ చెట్లను తయారుచేశాడు. వీటిని రెండు అడుగుల ప్లేస్‌లో కూడా బిగించుకోవచ్చు. అంతేకాదు.. బాల్కనీల్లో, రూఫ్ మీద వేసుకునేందుకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ వేస్ట్‌తో టైల్స్ తయారుచేశాడు. అవి కూడా ఎండ పడితే కరెంట్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆవిష్కరణలు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా అందుకున్నాయి.
గుజరాత్‌కు చెందిన శని పాండ్య పండిట్ దీన్‌దయాల్ ఎనర్జీ యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత అదే యూనివర్సిటీ ఇన్‌క్యుబేటర్‌లో చేరి, సోలార్ పవర్ మీద రీసెర్చ్ చేశాడు. అప్పుడే అతను సాధారణ సోలార్ ప్యానెల్స్ బిగించుకోవడానికి ప్లేస్ చాలా ఎక్కువగా అవసరం అవుతుందని, పైగా ఆ స్థలాన్ని 30 ఏళ్ల పాటు ఇతర అవసరాలకు వాడడం కుదరదని తెలుసుకున్నాడు.
అందుకే ప్లేస్ తక్కువగా ఉండే పెద్ద పెద్ద నగరాల్లో ప్రజలు సోలార్ ఎనర్జీపై ఆసక్తి చూపించడం లేదని గమనించాడు. ‘‘ఒకచోట ఆరెకరాల భూమిలో కేవలం ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయడం చూశా. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనిపెట్టాలని నిర్ణయించుకున్నా. ఆ లక్ష్యంతోనే స్టార్టప్ ప్రయాణాన్ని మొదలుపెట్టా’ అన్నాడు శని.
ఇమాజిన్ పవర్‌ట్రీ
శని 2018లో ఇమాజిన్ పవర్‌ట్రీ పేరుతో స్టార్టప్ పెట్టాడు. దానిద్వారా ‘సోలార్ ట్రీ’ని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఇది ఒకే స్తంభంపై 45 సోలార్ మాడ్యూల్స్‌ని బ్యాలెన్స్ చేయగలదు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక చెట్టు లాంటి ఆకారంలో ఉన్న సోలార్ ప్యానెల్ అన్నమాట. దీనిద్వారా రోజుకు 20 కిలోవాట్ల వరకు పవర్ ఉత్పత్తి అవుతుంది. దాంతో దాదాపు ఆరు ఇళ్లకు పవర్‌ని సప్లై చేయొచ్చు. దీని వల్ల భూమి అవసరం 2,200 చదరపు అడుగుల నుంచి కేవలం 2 చదరపు అడుగులకు తగ్గింది.
‘‘ఈ చెట్లు ప్రతిరోజూ పవర్‌ని అందించగలవు. ఇలాంటి సోలార్ ట్రీస్‌ని ఇప్పటికే అమెరికాలో ఉపయోగిస్తున్నారు. కానీ, వాటిని సుందరీకరణ, వైఫై, సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు.. ఇలా చిన్న చిన్న అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. మన దగ్గర సిటీల్లో సోలార్ సిస్టమ్ బిగించుకోవాలి అనుకునేవాళ్లకు ఇది బెస్ట్ చాయిస్” అంటున్నాడు శని.
గాంధీనగర్లో..
శని మొదటగా ఈ సోలార్‌ట్రీ ఇన్‌స్టాలేషన్స్‌ని గాంధీనగర్‌లో మొదలుపెట్టాడు. అక్కడి అధికారులు గాంధీనగర్‌లో ‘‘స్మార్ట్ సిటీ మిషన్” మొదలుపెట్టారు. అందులో భాగంగా సిటీలో వాడే కరెంట్‌లో కనీసం 10 శాతం సోలార్ ద్వారా ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
అది తెలుసుకున్న శని సిటీ ప్లానర్లతో మాట్లాడి స్ట్రీట్ లైట్ల ఖర్చు తగ్గించేందుకు సోలార్ లైట్లను బిగించాడు. ఆ అనుభవం శనికి మరిన్ని సిటీలకు బిజినెస్‌ని విస్తరించడానికి సాయపడింది. ముంబై నుంచి జమ్మూ వరకు ఉన్న ఎన్నో నగరాల్లో ఇప్పటివరకు 150కి పైగా సోలార్ చెట్లు నాటాడు శని.
సోలార్ టైల్స్
శని సోలార్ ట్రీ తర్వాత సోలార్ టైల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఒక టైల్‌కు 20-వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుంది. 150 టైల్స్‌తో ఒక ఇంటికి కావాల్సినంత కరెంట్‌ని ఉత్పత్తి చేయొచ్చు. వీటిని రూఫ్‌పై, గోడలు, బాల్కనీలు, ఫసేడ్‌లు, రోడ్లపై కూడా వేసుకోవచ్చు. ఈ టైల్స్ ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగలవు. ఒక్క టైల్ ధర రూ. 1,200 మాత్రమే.
‘‘మేము గుజరాత్‌లో జనవరిలో గాలిపటాల పండుగ చేసుకుంటాం. ఆకాశమంతా రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. గుజరాతీలు సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్‌లను ఇష్టపడకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే సాధారణ సోలార్ ప్యానెల్స్ బిగించుకుంటే పైకప్పు పూర్తిగా నిండిపోతుంది. కానీ.. మా టైల్స్ వల్ల ఎలాంటి సమస్య ఉండదు. వాటిపై నడవొచ్చు” అని చెప్పొకొచ్చాడు శని. పైగా ఈ టైల్స్‌ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వేస్ట్‌తో తయారుచేశారు. వీటి వల్ల ప్లాస్టిక్‌ని రీయూజ్ చేసినట్టు అవుతుంది.
ఎన్నో సవాళ్లు
శని స్టార్టప్ పెట్టిన మొదట్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పెట్టుబడి కోసం తన ఇంటిని మార్ట్‌గేజ్ చేసి లోన్ తీసుకున్నాడు. అప్పటివరకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుని విత్‌డ్రా చేశాడు. ఇంకా కొంత డబ్బుని తెలిసినవాళ్ల దగ్గర అప్పుగా తీసుకున్నాడు. కానీ.. ఇప్పుడు మాత్రం ప్రతియేటా కోట్లలో సంపాదిస్తున్నాడు. 2024లో రూ. 7 కోట్లు, 2025లో సుమారు రూ. 13 కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాదు.. శనికి జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా దక్కింది.
‘‘మా ఆవిష్కరణను ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. అది మా టీమ్‌కి మర్చిపోలేని క్షణం. ప్రధానమంత్రితో నన్ను చూసినప్పుడు మా ఫ్యామిలీ కళ్లలో నీళ్లు తిరిగాయి” అని తన జర్నీని పంచుకున్నాడు. శని 2025లో రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎల్‌ఐటీ అడ్వాన్స్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఇమాజిన్ పవర్‌ట్రీ 2025లో బెస్ట్ ఇండియన్ స్టార్టప్స్‌లో ఒకటిగా ఎంపికైంది.
