చైనా రోబోడాగ్.. థర్మాకోల్ డ్రోన్! ఏఐ సమిట్లో యూపీ గల్గోటియాస్ వర్సిటీ నిర్వాకం

చైనా రోబోడాగ్.. థర్మాకోల్ డ్రోన్! ఏఐ సమిట్లో యూపీ గల్గోటియాస్ వర్సిటీ నిర్వాకం

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. కేంద్రం సీరియస్
తప్పుదోవ పట్టించే ప్రదర్శనలు సహించబోమని హెచ్చరిక 
వర్సిటీ స్టాల్ ఖాళీ చేయించిన అధికారులు
క్షమాపణలు చెప్పిన వర్సిటీ యాజమాన్యం
తమ ప్రతినిధి అవగాహన లేక తప్పుడు సమాచారం ఇచ్చారని వివరణ 
ప్లానింగ్ లేదు.. అస్తవ్యస్తంగా ఏఐ సమిట్: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఎక్స్ పో’లో నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ చైనా రోబోడాగ్ ను తామే తయారు చేశామని ప్రదర్శనకు ఉంచడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనితోపాటు కొరియన్ కంపెనీకి చెందిన సాకర్ డ్రోన్ ను, థర్మాకోల్ తో తయారు చేసిన డమ్మీ డ్రోన్ నూ ప్రదర్శనకు ఉంచడం ద్వారా ఆ యూనివర్సిటీ దేశం పరువు తీసిందంటూ నెటిజన్ లు మండిపడ్డారు. దీంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. "వేరొకరి ఉత్పత్తులను తమవిగా చెప్పుకునే ప్రదర్శనలను ప్రోత్సహించం. ఆవిష్కరణల పేరుతో తప్పుదోవ పట్టిస్తే ఊరుకోబోం” అని హెచ్చరించింది. అనంతరం ఏఐ సమిట్ ఎక్స్ పో నుంచి ఆ యూనివర్సిటీని అధికారులు బుధవారం ఖాళీ చేయించారు.  

నిజానికి ఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం ప్రారంభమైన ఏఐ సమిట్ ఎక్స్​పో లో తొలి రోజే గంరదగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా అని ప్రచారం చేసుకుంటూ సమిట్​లోని ఫుడ్ స్టాల్స్ లో యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పించకపోవడం అసంతృప్తికి దారి తీసింది. అలాగే, నియోసేపియన్ స్టార్టప్ స్టాల్ లో పరికరాలు చోరీ కావడం.. వైఫై, ఇతర సౌలతులు లేక సందర్శకులు ఇబ్బందులు పడడంతో గందరగోళం ఏర్పడింది. దీనిపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్షమాపణలు చెప్పారు. సమిట్ సజావుగా నడిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతలోనే తాజాగా చైనా రోబోడాగ్, సాకర్ డ్రోన్, థర్మాకోల్ డ్రోన్లు ప్రదర్శనకు ఉంచినట్టు బయటపడటంతో ఏఐ సమిట్ ప్రతిష్ట మరింత దిగజారినట్టయింది.

గల్గోటియాస్ ఘనకార్యాలు ఇలా.. 

గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ, ఏఐ సమిట్‌‌లో 'ఓరియన్' అనే పేరుతో ఒక రోబో డాగ్ ను ప్రదర్శించింది. యూనివర్సిటీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. తమ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఈ రోబోను స్వయంగా అభివృద్ధి చేసిందని గర్వంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, టెక్ నిపుణులు, నెటిజన్లు ఆ రోబోను నిశితంగా పరిశీలించగా, అది చైనాకు చెందిన యూనిట్రీ గో2 రోబోడాగ్ మోడల్ అని తేలింది. దీనిని ఆన్‌‌లైన్‌‌లో రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలకే ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. చైనా వస్తువును తెచ్చి, పేరు మార్చి 'మేడ్ ఇన్ ఇండియా'గా ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైనా రోబోడాగ్ తోపాటు కొరియన్ సాకర్ డ్రోన్ కూడా తమదేనంటూ గల్గోటియాస్ ఏఐ సమిట్​లో క్లెయిమ్ చేసుకోవడం కూడా దుమారం రేపింది. 

తాము క్యాంపస్‌‌లో రూపొందించిన 'మేడ్ ఇన్ ఇండియా' ఆవిష్కరణగా ఒక సాకర్ డ్రోన్‌‌ను వర్సిటీ ప్రతినిధి మీడియాకు పరిచయం చేశారు. కానీ, అది దక్షిణ కొరియా కంపెనీ హెల్సెల్ తయారుచేసిన స్ట్రైకర్ వీ3 ఏఆర్ఎఫ్ డ్రోన్ అని నెటిజన్లు బయటపెట్టారు. ఏకంగా థర్మాకోల్ ముక్కలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, రబ్బర్ బ్యాండ్‌‌లతో కట్టిన ఒక డమ్మీ డ్రోన్‌‌ను కూడా ఈ యూనివర్సిటీ సిబ్బంది ప్రదర్శనకు ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడంతో.. "ఇలాంటి నాసిరకం ప్రదర్శనలతో దేశ పరువు తీస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి" అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

 బుకాయించి.. సారీ చెప్పిన యూనివర్సిటీ 

వివాదం ముదరడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చింది. తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని పేర్కొంది. కానీ, యూనివర్సిటీ ప్రతినిధి కెమెరా ముందు "మేమే తయారు చేశాం" అని స్పష్టంగా చెప్పిన వీడియోలను ఆధారంగా చూపుతూ.. నెటిజన్లు నిజం బయటపెట్టారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం క్షమాపణలు కోరుతూ.. వివరణ ఇచ్చింది. విద్యార్థులకు ఏఐ ప్రోగ్రామింగ్‌‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పరికరాలను వాడుతున్నామని, 
ఆ క్రమంలోనే చైనా రోబోను తెచ్చామని తెలిపింది.

గ్లోబల్ టెక్ టాలెంట్​కు భారత్ గుండెకాయ: యూకే మంత్రి 

ఏఐ రంగంలో భారత్ ఎదుగుతున్న తీరుపై బ్రిటన్ ఏఐ, ఆన్‌‌లైన్ సేఫ్టీ శాఖ మంత్రి కనిష్క నారాయణ్ ప్రశంసల వర్షం కురిపించారు. గ్లోబల్ టెక్ టాలెంట్​కు భారతదేశం "గుండెకాయ" వంటిదని ఆయన అభివర్ణించారు. 'ఏఐ ఇంపాక్ట్ సమిట్' వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.  "ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ టెక్ సంస్థల్లో భారతీయులే కీలక పాత్ర పోషిస్తున్నారు. సామాన్యులకు సైతం ఏఐని అందుబాటులోకి తీసుకురావాలనే భారత్ లక్ష్యం అభినందనీయం" అని అన్నారు.