రాత్రికి రాత్రే కోటీశ్వరుడు: మదురో అరెస్ట్‌ను ముందే ఊహించి రూ. 3.6 కోట్లు కొల్లగొట్టాడు!

 రాత్రికి రాత్రే కోటీశ్వరుడు: మదురో అరెస్ట్‌ను ముందే ఊహించి రూ. 3.6 కోట్లు కొల్లగొట్టాడు!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ కావడంతో కొందరు వ్యాపారులు మాత్రం తెలివిగా భారీగా లాభపడ్డారు. ఎలా అని ఆశ్చర్య పోతున్నారా...  సాధారణ ప్రజలు మదురో అరెస్ట్ వార్త ఒక్కసారిగా తెలియగానే ఆశ్చర్యపోయారు... కానీ కొందరు వ్యాపారులు మాత్రం ఈ విషయాన్ని ముందే ఊహించి పందెం వేశారు. పాలిమార్కెట్ (Polymarket) వంటి అంచనా మార్కెట్లలో మదురో పట్టుబడటం లేదా  అరెస్ట్ అవుతాడని  పందెం వేసి వేల డాలర్లు గెలుచుకున్నారు.

శనివారం ఉదయం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించక ముందే, శుక్రవారం రాత్రి నుంచే ఈ మార్కెట్లలో మదురో పై పందాలు పెరిగిపోయాయి.

విషయం ఏంటంటే ఈ మార్కెట్లలో ఒక కొత్త అకౌంట్ ద్వారా శుక్రవారం రాత్రి సుమారు $30,000 అంటే సుమారు 25 లక్షల రూపాయలు  పెట్టుబడి పెట్టారు. మదురో అరెస్ట్ అయిన తర్వాత, పెట్టిన ఆ పెట్టుబడి విలువ ఏకంగా $4,36,759 అంటే సుమారు 3.6 కోట్ల రూపాయలకు చేరింది.

►ALSO READ | అమెరికా-వెనిజులా ఇష్యూపై స్పందించిన భారత్.. ఏ దేశానికి సపోర్ట్ చేసిందంటే..?

శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మదురో పదవి నుంచి తప్పుకుంటారనే బెట్టింగ్ రేట్లు అకస్మాత్తుగా పెరిగాయి. అంటే ఎవరో ముందే ఈ సమాచారాన్ని ఊహించారని లేదా ఇంటర్నల్ సమాచారం తెలిసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ పరిణామాలు, స్పోర్ట్స్  లేదా ఎన్నికల ఫలితాలపై ఇలాంటి అంచనా మార్కెట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. 2024 అమెరికా ఎన్నికల సమయంలో కూడా ఈ మార్కెట్లు ఇలాగే వార్తల్లో నిలిచాయి. అయితే, ఇలాంటి సున్నితమైన రాజకీయ విషయాలపై పందాలు వేయడం, ఇంటర్నల్ సమాచారాన్ని వాడుకోవడం వంటి అంశాలపై ఇప్పుడు తీవ్ర చర్చ మొదలైంది.