అమెరికా-వెనిజులా ఇష్యూపై స్పందించిన భారత్.. ఏ దేశానికి సపోర్ట్ చేసిందంటే..?

అమెరికా-వెనిజులా ఇష్యూపై స్పందించిన భారత్.. ఏ దేశానికి సపోర్ట్ చేసిందంటే..?

న్యూఢిల్లీ: అమెరికా–వెనిజులా ఇష్యూపై ఇండియా తొలిసారి స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఆదివారం (జనవరి 4) ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా దాడుల తర్వాత వెనిజులాలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్.. చర్చల ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చింది. 

‘‘వెనిజులాలో ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతును పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు పిలుపునిస్తున్నాము’’ అని ప్రకటనలో పేర్కొంది. వెనిజులాలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అక్కడి భారతీయులకు అవసరమైన సహయాన్ని అందిస్తామని తెలిపింది.

అలాగే, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో వెనిజులాలోని భారత పౌరులకు విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. వెనిజులాలోని భారత పౌరులు రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని సూచింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని చెప్పింది. అలాగే.. వెనిజులాకు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించింది. కాగా, అమెరికా-వెనిజులా వ్యవహారంలో ఇండియా ఏ దేశానికి మద్దతు ఇవ్వకుండా.. తటస్థ వైఖరి అవలభించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఎప్పటిలాగానే శాంతి మంత్రం జపించింది. 

►ALSO READ | జపాన్‌తో దూరం.. చైనాతో స్నేహం: కొరియా శాంతి కోసం అధ్యక్షుడి పర్యటన.. జీ జిన్‌పింగ్‌తో భేటీ !

2025, జనవరి 4న వెనిజులాపై అమెరికా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. బాంబులు, మిస్సైళ్లతో వెనిజులా రాజధాని కారకాస్ నగరంపై అమెరికా ఎయిర్ ఫోర్స్ విరుచుకుపడింది. అనంతరం అమెరికాకు చెందిన అత్యంత పటిష్టమైన డెల్టా ఫోర్స్ వెనిజులా అధ్యక్షుడు నిలకోస్ మదురోతో పాటు ఆయన భార్య సిలోయో ఫ్లోరెస్‍ను నిర్భంధించి అమెరికాకు తరలించింది. నార్కో, టెర్రరిజం అభియోగాలపై వెనిజులా ప్రెసిడెంట్ మదురోను అరెస్ట్ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. 

అమెరికా దళాలు బంధించిన మదురో ఫొటోలను విడుదల చేశారు. మదురో, ఆయన భార్య నార్కో, టెర్రరిజం కేసులకు సంబంధించి న్యూయార్క్‎లో విచారణ ఎదుర్కొంటారని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక దేశంపై దాడులు చేసి ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకెళ్లడం ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారింది. ట్రంప్ తీరును చైనా, రష్యా, బ్రెజిల్, క్యూబా, కొలంబియా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. ట్రంప్ తీరు లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై దాడి అని కొలంబియా అధ్యక్షుడు అభివర్ణించారు.