భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆడేందుకు సిద్ధంగా లేనట్టు సమాచారం. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్లడం ఇష్టం లేదని ఐసీసీకి బంగ్లాదేశ్ ఈమెయిల్ ద్వారా తెలిపింది. బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ 2026 నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తక్షణమే ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ బంగ్లాదేశ్ కు మినహాయింపు ఇస్తే ఆ దేశం పాకిస్థాన్ లాగే తమ మ్యాచ్ లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది.
వరల్డ్ కప్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను మార్చాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ తిరస్కరించింది. దీనిని లాజిస్టికల్ పీడకలగా చెప్పుకొచ్చింది. ఐసీసీకి పంపిన మెయిల్ లో మూడు విషయాలను గురించి ప్రస్తావించారు. మొదటిది ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ 2026 నుంచి ఎందుకు తొలగించారు. రెండోది ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ కు భద్రతా విషయంలో ఆందోళనలు ఉన్నాయని.. ఆటగాళ్లు మాత్రమే కాకుండా వారితో పాటు మీడియా, అభిమానులు, స్పాన్సర్లు కూడా ప్రపంచ కప్‌ను చూడటానికి ఇండియాకు వస్తారని BCB అధికారి ఒకరు అన్నట్టు సమాచారం.
అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్ 2026 నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తప్పించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ. 9.20 కోట్లకు నైట్‌రైడర్స్ దక్కించుకుంది. అయితే ప్రస్తుతం బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అతన్ని ఐపీఎల్ నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ.. నైట్‌రైడర్స్‌ను కోరింది. దాని ప్రకారమే అతన్ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ముస్తాఫిజుర్ ను తప్పించడం పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం అసహనంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
►ALSO READ | Ashes 2027: అంత తొందర ఎందుకు బాస్.. 2027 యాషెస్‌కు ఆస్ట్రేలియా స్క్వాడ్ ప్రకటించిన పాంటింగ్!
ముస్తాఫిజుర్ ను కేకేఆర్ రిలీజ్ చేసిన వెంటనే.. భారత్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి)ను ఆదేశించినట్టు సమాచారం. జై షా నేతృత్వంలోని ఐసీసీతో ఈ విషయాన్ని చర్చించి ఇండియాలో జరగనున్న బంగ్లాదేశ్ ప్రపంచ కప్ మ్యాచ్ లకు వేదిక మార్పు కోరాలని బీసీబీని కోరినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ తెలిపారు. "క్రీడా మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించే సలహాదారుగా నేను క్రికెట్ కంట్రోల్ బోర్డును మొత్తం విషయాన్ని లిఖితపూర్వకంగా అందించి ఐసీసీకి వివరించాలని ఆదేశించాను". అని నజ్రుల్ ఫేస్‌బుక్‌లో బెంగాలీలో రాశారు.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం ఇండియాలో బంగ్లాదేశ్ మొత్తం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. మూడు కోల్‌కతాలో ఒకటి ముంబైలో జరగనుంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్, ఫిబ్రవరి 9న ఇటలీ, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్ తో కోల్‌కతాలో మ్యాచ్ లు ఆడనుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్ లను శ్రీలంకలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై అటు ఐసీసీ.. ఇటు బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Ricky Ponting picks his Australia squad for the next men’s Ashes series in 2027 🇦🇺 pic.twitter.com/YDQEfnd4nw
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2026
