నో అఫిడవిట్.. నో రెగ్యులరైజేషన్!..సాదాబైనామాల క్రమబద్దీకరణకు అడ్డొస్తున్న రూల్స్

నో అఫిడవిట్.. నో రెగ్యులరైజేషన్!..సాదాబైనామాల క్రమబద్దీకరణకు అడ్డొస్తున్న రూల్స్
  • భూమి అమ్మినవాళ్లు అఫిడవిట్​ ఇవ్వకపోతే రిజెక్ట్​ 
  • ఆన్​లైన్​లో భూయజమాని పేరు లేకపోయినా అంతే..
  • మోకాపై ఎంక్వైరీ జరిపి క్రమబద్దీకరిస్తేనే రైతులకు మేలు
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రెగ్యులరైజేషన్​కు నోచాన్స్

మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లి గ్రామానికి చెందిన దాడి రామయ్య తండ్రి పోచం దాంపూర్​ శివారులోని సర్వే నంబర్​ 70లో 1970లో పది గుంటల భూమి కొనుగోలు చేశాడు. అప్పుడు రాసుకున్న సాదాబైనామా ఆధారంగా 20 ఏండ్ల కింద రామయ్యకు పట్టా ఇచ్చినప్పటికీ, అది ఇంప్లిమెంట్​ కాలేదు. దీంతో 2020లో సాదాబైనామా రెగ్యులరైజేషన్​ కోసం దరఖాస్తు చేశాడు. రామయ్య పేరిట పట్టా ఇవ్వాలంటే భూమి అమ్మిన వ్యక్తి లేదా అతడి వారసులు వచ్చి సంతకాలు పెట్టాలని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. భూమి అమ్మిన వ్యక్తి చనిపోగా, అతడి వారసులు హైదరాబాద్​లో స్థిరపడ్డారు. వారు అఫిడవిట్​ ఇవ్వడానికి రాకపోవడంతో రామయ్య సమస్య పరిష్కారం కాలేదు.

మహబూబ్​నగర్  జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్​కోట గ్రామానికి చెందిన హనుమంతు తండ్రి పెంటప్ప 35 ఏండ్ల కింద ఇదే గ్రామానికి చెందిన మదన్మోహన్​రావు దగ్గర ఎకరం పొలం కొన్నాడు. భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్  చేసుకోలేదు. సాదాబైనామా రాయించుకున్న పెంటప్ప కొద్ది నెలల కింద చనిపోయాడు. సాదాబైనామా క్రమబద్ధీకణలో భాగంగా 2020లో పెంటప్ప కొడుకు హనుమంతు అప్లికేషన్  పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. సాదాబైనామా రాసిచ్చిన మదన్మోహన్​రావు స్పందించడం లేదు.-

మంచిర్యాల, వెలుగు: రాష్ట్రంలో సాదాబైనామాల క్రమబద్దీకరణకు సర్కారు విధించిన  రూల్స్​ అడ్డంకిగా మారాయి. దశాబ్దాల కింద రైతులు తెల్లకాగితాలపై రాసుకొని భూములు కొన్నారు. వాటిని రెగ్యులరైజ్​ చేసేందుకు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 2020 అక్టోబర్​ 21 నుంచి నవంబర్​ 20 వరకు మీ సేవలో దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 

కోర్టు కేసులు, ఇతర కారణాలతో వాటి పరిష్కారం ఆలస్యమైంది. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెచ్చిన భూభారతి చట్టం సెక్షన్​ 6, సబ్​ సెక్షన్​ 1 ద్వారా సాదాబైనామాల క్రమబద్దీకరణకు అవకాశం కల్పించింది. దీంతో ఈ ప్రక్రియ తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల్లో స్పీడప్​ అయింది. 

అమ్మినోళ్లు అఫిడవిట్​ ఇస్తేనే..

సాదాబైనామాలను రెగ్యులరైజ్​ చేయాలంటే గతంలో భూములు అమ్మిన యజమానులు, వారు లేకుంటే వారి వారసులు తప్పనిసరిగా అఫిడవిట్​ ఇవ్వాలన్న నిబంధన అందుకు అడ్డంకిగా మారింది. తహసీల్దార్లు భూమి అమ్మిన వారికి, కొన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే దశాబ్దాల కింద భూములు అమ్మినవాళ్లు ఇప్పుడు అఫిడవిట్​ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. 

ఒకవేళ వారు కాన్సెంట్​ ఇచ్చినా వారి వారసులు సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారు. నాడు వేలల్లో ఉన్న భూముల రేట్లు నేడు లక్షల్లో పలుకుతుండడమే దీనికి కారణం. కొంత మంది ప్రస్తుత మార్కెట్​ రేట్ల ప్రకారం డబ్బులు చెల్లిస్తేనే అఫిడవిట్​ ఇస్తామంటున్నారు. దీంతో అటువంటి దరఖాస్తులను రిజెక్ట్​ చేయాల్సి వస్తోందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

సాంకేతిక సమస్యలు సైతం.. 

సాదాబైనామాల క్రమబద్దీకరణకు సాంకేతిక సమస్యలు సైతం అడ్డొస్తున్నాయి. సాఫ్ట్​వేర్​లో భూమి విక్రయించిన వ్యక్తి వివరాలు, సాదాబైనామా వివరాలతో మ్యాచ్​ కాకపోవడంతో అటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. సాదాబైనామా రాసిచ్చిన వ్యక్తి పేరు భూభారతి పోర్టల్​లో లేకపోయినా, ఆధార్​ నంబర్​ తప్పుగా నమోదైనా, ఒక సర్వేనంబర్​లో ఉన్న భూమిని ఒకరి కంటే ఎక్కువ మంది పేరిట సాదాబైనామా చేసినా రెగ్యులరైజ్ చేయడానికి రూల్స్​ ఒప్పుకోవడం లేదు.

 అంతేగాకుండా ఒక సర్వే నంబర్​లో భూమి అమ్మితే సాదాబైనామాలో మరో సర్వే నంబర్​గా పేర్కొనడం, ప్రభుత్వ భూములు, అసైన్డ్​ ల్యాండ్స్​తో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సాదాబైనామాల రెగ్యులరైజేషన్​కు చాన్స్​ లేకపోవడంతో చాలా అప్లికేషన్లు రిజెక్ట్​ అవుతున్నాయి. ఇలా మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలో 990 దరఖాస్తులు వస్తే 870 తిరస్కరించారు. అలాగే మంచిర్యాల మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని నస్పూర్​ మండలంలో 225 అప్లికేషన్లు రాగా రిజెక్ట్​ చేశారు. 

ఇలా చేస్తే రైతులకు మేలు..   

భూమి అమ్మిన వ్యక్తి అఫిడవిట్​ ఇవ్వడానికి ముందుకు రాకపోతే రెవెన్యూ అధికారులు మోకాపై ఎంక్వైరీ జరిపి సాదాబైనామాలు క్రమబద్దీకరిస్తే రైతులకు మేలు జరుగుతుందని అంటున్నారు. భూమి కొన్ని వ్యక్తి వాస్తవంగా మోకాపై ఉన్నాడా? లేడా? అని చుట్టుపక్కల రైతులను విచారించి వారి వాంగ్మూలం తీసుకోవడం, లేదా గ్రామ పెద్దల స్టేట్​మెంట్​ ఆధారంగా, పహాణీలోని సాగుదారు కాలమ్​లో ఉన్న పేర్లను నిర్ధారించుకొని పట్టాదారు పాస్​బుక్​ జారీ చేయాలని కోరుతున్నారు.

 ఇప్పటివరకు ఆర్డీవోలు అప్రూవల్​ చేసిన 134 సర్వే నంబర్లలో నారాయణపేట జిల్లాలో రెండు, జయశంకర్​ భూపాలపల్లిలో మూడు, మెదక్​లో 16, మహబూబాబాద్​లో ఒకటి, నల్గొండలో 8, నిజామాబాద్​లో 79, కరీంనగర్​లో 5, జగిత్యాలలో 6, జనగామలో 2, ములుగులో 4, సూర్యాపేటలో ఒకటి, ఖమ్మంలో 2, యాదాద్రిభువనగిరిలో 2, ఆదిలాబాద్​ జిల్లాలో 3 మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాల్లో ఇంతవరకు ఒక్క అప్లికేషన్​ కూడా పరిష్కారానికి నోచుకోలేదు.--

సాదాబైనామాల వివరాలు..

మొత్తం దరఖాస్తులు        9,00,800
మొత్తం సర్వే నంబర్లు    11,49,316
నోటీసులు జనరేట్​ చేసినవి              9,00,560
ఆర్డీవోల లాగిన్​కు పంపినవి            6,56,595
ఆప్రూవల్​ చేసిన సర్వే నంబర్లు        134
రిజెక్ట్​ చేసిన సర్వే నంబర్లు                 3,89,902
పెండింగ్​ అప్లికేషన్లు                       3,39,438
డిస్పోజ్​ చేసిన దరఖాస్తులు             3,17,157