హరీశ్ రావు బీఆర్ఎస్‌‌‌‌ లో గుంపు తయారు చేసుకుండు : కవిత

హరీశ్ రావు బీఆర్ఎస్‌‌‌‌ లో గుంపు తయారు చేసుకుండు : కవిత
  • ఆయన్ను తిడితే అసెంబ్లీని బాయ్​కాట్ చేయడం బీఆర్ఎస్ డ్రామా: కవిత
  • తెలంగాణకు 3 శాతం నీటి వాటా తగ్గించే ఒప్పందంపై సంతకం చేసింది హరీశ్​ కాదా? 
  • గత ప్రభుత్వ పాపంలో నాకూ భాగస్వామ్యం ఉన్నందుకు క్షమించండి
  • సూర్యాపేట జిల్లాలో రెండో రోజు జాగృతి జనం బాట

సూర్యాపేట/కోదాడ/హుజూర్ నగర్, వెలుగు: కేసీఆర్ ను ఎన్ని తిట్లు తిట్టినా అసెంబ్లీని బాయ్ కాట్ చేయని బీఆర్ఎస్​.. హరీశ్ రావును ఒక్క తిట్టు తిట్టగానే ఎందుకు బాయ్ కాట్ చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. గుంటనక్క హరీశ్ రావు బీఆర్ఎస్ లో గుంపుని తయారు చేసుకుంటున్నట్లు అర్థం అవుతుందని అన్నారు. 

హరీశ్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పానన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో ఆమె పర్యటించారు. సూర్యాపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు. బాయ్ కాట్ నిర్ణయం హరీశ్ రావు దేనని తాను భావిస్తున్నట్టు చెప్పారు. అది ఒక వేళ కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమైతే పార్టీకి మంచిది కాదన్నారు. అసెంబ్లీ బాయ్ కాట్ బీఆర్ఎస్ డ్రామా అని అన్నారు. హరీశ్ రావు దమ్ముంటే తన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. 

కృష్ణా జలాల్లో 

తెలంగాణకు 37 శాతం వాటా ఉండగా 2016లో కేఆర్ఎంబీ మీటింగ్​లో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు తెలంగాణకు 34 శాతానికి ఒప్పుకుంటూ సంతకం పెట్టింది నిజమా కాదా అని ప్రశ్నించారు. జూరాల సోర్స్ పాయింట్ శ్రీశైలానికి ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ ధన దాహం కోసం శ్రీశైలానికి సోర్స్ పాయింట్ మార్చారని విమర్శించారు. 

ఎల్లూర్ పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చారని, అందుకు దాదాపు రూ.14 వందల కోట్లు ఖర్చు పెట్టారని, దీని కారణంగా 30 మీటర్ల ఎత్తు పెరిగి మనం తీసుకోవాల్సిన వాటర్ కెపాసిటీ తగ్గిందని మండిపడ్డారు. అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ వల్ల కల్వకుర్తి మోటార్లు చెడిపోయాయన్నారు.

గత ప్రభుత్వం రైతులకు బేడీలు వేసింది

‘బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేశారు. ఉద్యమకారులకు చేయాల్సినంతా చేయలేదు, ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉన్నట్లే. అందుకే క్షమాపణ చెప్పా’ అని కవిత అన్నారు. భవిష్యత్ లో చాలా జరుగుతాయని, ఇక నేను సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్ ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు, మరి కృష్ణానదిలో నష్టం చేస్తున్న రేవంత్​ను రెండుసార్లు ఉరి తీయాలన్నారు. 

కేసీఆర్ ని కసబ్​అనడం దేశద్రోహామే అవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పాలమూరు–రంగారెడ్డికి 70 టీఎంసీలు, కొడంగల్–నారాయణ్ పేట్ కు 7.50 టీఎంసీలు కేటాయించారని, కానీ 45 టీఎంసీలకు పరిమితమవటానికి  కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సంతకం చేసిందన్నారు.

అసెంబ్లీలో అబద్ధాలు

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే పాలక వర్గం కృష్ణా నది మీద అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపెక్స్ కమిటీలో ఏమి మాట్లాడి వచ్చారో చెప్పారే తప్ప ప్రస్తుతం కృష్ణా నీటిపై జరుగుతున్న అన్యాయంపై చర్చ జరగలేదన్నారు. కర్నాటక అల్మట్టి ఎత్తు పెంచ డం, అప్పర్ భద్ర డ్యామ్​పై ఎందుకు చర్చ చేయలేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు. 

ఈ అంశాలపై ప్రభుత్వం అసెంబ్లీలో  తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో తుపాకీ ద్వారా పోరాటం కష్టం అని కవిత అభిప్రాయపడ్డారు. సామాజిక తెలంగాణను ప్రతిపాదించిన వ్యక్తి మారోజు వీరన్న అని.. ఆయన స్ఫూర్తితోనే మేము కూడా ఉద్యమం చేస్తున్నామని తెలిపారు.