నిరుద్యోగులే టార్గెట్ ..ఉద్యోగాల పేరుతో విదేశాలకు రప్పించి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నరు

నిరుద్యోగులే టార్గెట్ ..ఉద్యోగాల పేరుతో విదేశాలకు రప్పించి సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నరు

నిరుద్యోగులే వాళ్ల టార్గెట్ విదేశాల్లో మంచి ఉద్యోగం అని చెబుతారు.. లక్షల్లో జీతం, అన్ని రకాల సౌకర్యాలుంటాయని నమ్మబలుకుతారు..విదేశాలకు పంపిస్తారు.. విదేశాల్లో ఉద్యోగం అని ఎన్నో ఆశలతో వెళ్లిన నిరుద్యోగులకు చేయకూడని పనులన్నీ చేయిస్తారు. విదేశీ ఉద్యోగం పేరుతో సైబర్ క్రైమ్ కాల్ సెంటర్లకు నిరుద్యోగ యువతను పంపుతున్న  మోసగాళ్ల ముఠా గుట్టు రట్టు అయింది. తెలంగాణలో నిరుద్యోగ యువతను టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రైం ఏజెంట్ల గ్యాంగ్ ను   పోలీసులు పట్టుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అక్కడ సైబర్ క్రైం చేయిస్తున్న ముగ్గురిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

 జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  చెప్పిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ కు చెందిన పలువురు నిరుద్యోగులను నమ్మించి సైబర్  మోసాలు చేయించారు ఏజెంట్లు.  ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు  జిల్లాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించాం. పలువురిని ఉద్యోగాల పేరిట థాయిలాండ్ నుంచి  లావోస్ తీసుకెళ్లి సైబర్ ఫ్రాడ్ చేయిస్తున్నారు నిందితులు . లావోస్‌కు రప్పిస్తే ఒక్కొక్కరికి 13,000 యువాన్లు (సుమారు రూ.1.75 లక్షలు) కమిషన్ ఇస్తామని నమ్మించి ఏజంట్ల ద్వారా మోసం  చేస్తున్నారు.  బ్యాంకాక్ కాల్ సెంటర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి 75,000 - 1,05,000 వరకు వసూలు చేసి, ముందుగా టూరిస్టు వీసాపై థాయిలాండ్ (బ్యాంకాక్) కు రప్పించారు.  తర్వాత బ్యాంకాక్ నుంచి ఏజెంట్ల ద్వారా సరిహద్దు అక్రమంగా దాటి లావోస్ దేశంలోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతానికి తరలించారు. 

 చైనా కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న సైబర్ కాల్ సెంటర్లలో పని చేయమని బలవంతం చేసేవారు.  అమెరికా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, ముఖ్యంగా USAలో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు చేయించేవారు.  పని చేయనని చెప్పిన వారికి పాస్‌పోర్టులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడేవారు.  నిందితుల వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, పాస్పోర్ట్ లు,  కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాం.  విదేశీ ఉద్యోగాలతో పొంచి ఉన్న ప్రమాదంపై యువత జాగ్రత్తగా ఉండాలి అని ఎస్పీ హెచ్చరించారు.