ఫైనల్‌కు ముందే బిగ్ టెన్షన్.. అర్జెంటీనా vs స్పెయిన్ మ్యాచ్ ఆగిపోయే ఛాన్స్..?

ఫైనల్‌కు ముందే బిగ్ టెన్షన్.. అర్జెంటీనా vs స్పెయిన్ మ్యాచ్ ఆగిపోయే ఛాన్స్..?

FIFA World Cup Final Be Postponed: కెనడా అడవుల మంటల (Wildfires) వల్ల వెలువడిన దట్టమైన పొగమంచు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను కమ్మేయడంతో, ఆదివారం జరగబోయే అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఓపెన్- ఎయిర్ వేదికైన న్యూజెర్సీ స్టేడియం (మెట్‌లైఫ్ స్టేడియం) పరిసరాల్లో గాలి నాణ్యత (Air Quality) వేగంగా క్షీణించి, ప్రమాదకర స్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.  
 
ఫిఫా అప్రమత్తం: 
ఈ కాలుష్య సమస్య తీవ్రతను వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ అండ్ ఫిఫా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) కు చెందిన నిపుణులు నేరుగా ఫిఫా ప్రధాన కార్యాలయం నుంచి వాతావరణ మార్పులను ట్రాక్ చేస్తున్నారు. శనివారం కురిసే వర్షంతో ఆదివారం నాటికి పొగమంచు తగ్గి, గాలి నాణ్యత సాధారణ స్థితికి (Moderate) వచ్చే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాచ్ వాయిదా పడే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ, కాలుష్యం పెరిగితే ప్లేయర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. 

విషపూరిత పొగలో స్పెయిన్ ప్రాక్టీస్.. సురక్షితంగా అర్జెంటీనా : 
ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పెయిన్ జట్టు గురువారం న్యూజెర్సీలో అవుట్‌డోర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ స్పెయిన్ ప్లేయర్స్ మైదానంలో చెమటోడ్చారు. మరోవైపు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించిన అర్జెంటీనా జట్టు అట్లాంటా (జార్జియా)లోనే ఉండిపోవడంతో ఈ పొగమంచు ప్రభావం నుంచి తప్పించుకుంది. 

ALSO READ : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు క్రేజ్ పీక్స్.. 

ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం:
అడవులలో ఏర్పడే మంటల వల్ల వచ్చే పొగలో వేలాది రకాల విషపూరిత కణాలు ఉంటాయని, ఇవి ఊపిరితిత్తులు, గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య కణాలు రక్తంలో చేరి ఆస్తమా లాంటి సమస్యలను పెంచుతాయి. ఒక సాధారణ వ్యక్తి కంటే, మైదానంలో 90 నిమిషాల పాటు తీవ్రమైన శారీరక శ్రమ చేసే ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎక్కువ గాలిని పీలుస్తారు. గాలి నాణ్యత సరిగ్గా లేకపోతే అది వారి స్టామినాను దెబ్బతీస్తుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు తేల్చి చెప్పారు. ఇక దాదాపు 80 వేల మంది అభిమానులు హాజరయ్యే ఈ మెగా ఫైనల్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ లవర్స్ కోరుకుంటున్నారు.