టమాట ధరలు ఢమాల్.. ఫ్రీగా పంచిన రైతు..ఎగబడ్డ జనం

టమాట ధరలు ఢమాల్.. ఫ్రీగా పంచిన రైతు..ఎగబడ్డ జనం

టమాట రేట్లు భారీగా  పడిపోయాయి. వ్యాపారులు  కిలోకు రూ.10 కూడా పెట్టడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో  కిలోకు  రూ.5 మాత్రమే చెల్లిస్తుండడంతో  అన్నదాతలు ఆగమవుతున్నారు.  కూలీలతో తెంపించి, తీసుకెళ్తే ఇటు కూలి పైసలు, అటు కిరాయి మీద పడ్తుండడంతో టమాటాలను తోటల్లోనే వదిలేస్తున్నారు. కొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. మరికొందరు ఫ్రీగా పంచుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి టమాట తోటలు సాగుచేశామని, తీరా రేటు పడిపోవడంతో పెట్టుబడులకూ మునుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బయట కూరగాయల మార్కెట్లో మాత్రం కిలోటమాటా రూ. 20 వరకు ఉండటం గమనార్హం. 

ఉచితంగా  పంపిణీ చేసిన రైతు 

 మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో  ఫిబ్రవరి 20న శుక్రవారం సంత కావడంతో  గూడూరు మండలం భూపతి పేటకు చెందిన రైతు ఆటోలో టమాటాలు తీసుకొచ్చాడు.  వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవడంతో తిరిగి తీసుకెళ్ల లేక అక్కడే తెచ్చిన ఆటోలో ఉచితంగా టమాటాలు పంచిపెట్టాడు. దీంతో జనాలు టమాటాల కోసం ఎగబడ్డారు. టమాట ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని..కూలీల ఖర్చులు కూడా చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  టమాటకు  గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.