చెన్నై/రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) మెన్స్ ఈవెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రాచి బెంగాల్ టైగర్స్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 3–-1 తేడాతో జేఎస్‌డబ్ల్యూ సూర్మా క్లబ్‌పై ఘన విజయం సాధించింది. తొలి రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ కూడా రాలేదు. కానీ బ్రేక్ తర్వాత బెంగాల్ టైగర్స్ జోరు పెంచింది.
సుఖ్‌జీత్ సింగ్ (33వ నిమిషం), అభిషేక్ (45వ ని), గుర్ సేవక్ సింగ్ (60వ ని) తలో గోల్ చేసి తమ జట్టును గెలిపించారు. సూర్మా తరఫున ప్రభ్‌జోత్ సింగ్ (54వ ని) ఏకైక గోల్ చేశాడు. మరోవైపు రాంచీ వేదికగా జరుగుతున్న విమెన్స్ హెచ్ఐఎల్ మ్యాచ్‌లో శ్రాచి బెంగాల్ టైగర్స్ మరో విజయం అందుకుంది. ఆదివారం జరిగిన పోరులో 1–-0 తేడాతో రాంచీ రాయల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఆట 37వ నిమిషంలో అగస్టినా గోర్జెలానీ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి బెంగాల్‌కు విజయాన్ని అందించింది.
