టీమిండియాలో ఎప్పుడు ఎవరు ఎంపికవుతారో ఎవరిపై వేటు పడుతుందో చెప్పడం కష్టం. కొన్నిసార్లు బాగా ఆడిన ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకోలేక కష్టపడతారు. మరికొంత మంది ప్లేయర్స్ కు నమ్మకంతో ఎక్కువ ఛాన్స్ లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అయితే టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మాత్రం ఈ రెండిటికి భిన్నం. గత కొంతకాలంగా అక్షర్ మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్. విదేశాల్లో జరిగే టెస్ట్ సిరీస్ లో మినహాయిస్తే అక్షర్ దాదాపు ప్రతి సిరీస్ కు ఎంపికవుతాడు. ప్లేయింగ్ 11 లో ఉన్నా లేకున్నా 15 మంది స్క్వాడ్ లో ఖచ్చితంగా ఉంటాడు. అవకాశం వచ్చినప్పుడల్లా బాగా రాణించే అక్షర్ కు సెలక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు.
జనవరి 11 నుంచి టీమిండియా న్యూజిలాండ్ తో స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు సెలక్టర్లు అక్షర్ పటేల్ ను ఎంపిక కాలేదు. అక్షర్ ను తప్పించడం వెనుక కారణం ఏంటో అర్ధం కావడం లేదు. సెలక్టర్లతో పాటు బీసీసీఐ కూడా అక్షర్ కు రెస్ట్ ఇస్తున్నట్టు చెప్పలేదు. మరోవైపు అతనిపై వేటు వేయడానికి కారణం లేదు. గత సంవత్సరం ఆస్ట్రేలియా టూర్ లో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు జడేజాను తప్పించి మరీ అక్షర్ కు ఛాన్స్ ఇచ్చిన సెలక్టర్లు..కివీస్ తో సిరీస్ కు మాత్రం ఎంపిక చేయలేదు. టీ20 వరల్డ్ కప్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అక్షర్ పటేల్ కు పని భారం దృష్టిలో ఉంచుకొని రెస్ట్ ఇస్తున్నారేమో.
సౌతాఫ్రికా సిరీస్ లో అక్షర్ కు గాయం:
2025 డిసెంబర్ లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా చివరి రెండు టీ20 మ్యాచ్ లకు దూరమయ్యాడు. తొలి మూడు మ్యాచ్ లు ఆడిన ఈ టీమిండియా ఆల్ రౌండర్ చివరి రెండు మ్యాచ్ లు ఆడలేదు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ కు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో వైస్ కెప్టెన్ గా ఉన్న అక్షర్ ను వరల్డ్ కప్ ముగిసేవరకు కేవలం టీ20 మ్యాచ్ లు ఆడించే ఉద్దేశ్యంలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. అక్షర్ పటేల్ లేకపోయినా స్పిన్ ఆల్ రౌండర్ గా వాషింగ్ టన్ సుందర్ జట్టులో కొనసాగుతున్నాడు.
న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత వన్డే జట్టు :
శుభమాన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్
