టీచర్ మందలించాడని ..ఉరేసుకున్న విద్యార్థి..పేరెంట్స్ ఆందోళన

టీచర్ మందలించాడని ..ఉరేసుకున్న విద్యార్థి..పేరెంట్స్ ఆందోళన

ఉపాధ్యాయుడు మందలించాడని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన   నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని ఏకలవ్య పాఠశాలలో జరిగింది.   పోలీసులు, పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మార్చి 3న  విద్యార్థి దగ్గర  సెల్ ఫోన్ కనిపించడంతో టీచర్ మందలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. సాయంత్రం తోటి విద్యార్థులతో ఆటలు ఆడిన తర్వాత కొంతసేపటికి బాత్రూంకి వెళ్లిన రామ్ చరణ్.. బట్టలు ఆరేసుకునే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

అది గమనించిన తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ కు తెలియజేశారు. వెంటనే పాఠశాల సిబ్బంది ప్రయివేట్ ఆస్పత్రికి విద్యార్థిని తరలించారు. అక్కడ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఆత్మహత్యకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి దగ్గర బాలుడి బంధువులు ధర్నాకు దిగారు.  ఉపాధ్యాయుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు  కుటుంబ సభ్యులు.