హైదరాబాద్ లో నార్కోటిక్, రాజేంద్రనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఇద్దరు విదేశీ డ్రగ్ పెడ్లర్స్ పట్టుబడ్డారు. మహమ్మద్ అబూరబు, హాసన్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిద్దరూ ఓమన్, పాలస్తీనా దేశాస్తులుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 25 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు 4 మొబైల్స్ ఓ కత్తి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ తో పాటు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు..
రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు A1 అబూ రబు గతంలో 6 డ్రగ్స్ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇద్దరూ మొదట టూరిస్ట్ వీసా తో భారత్ కి వచ్చారు. అనంతరం బిజినెస్ వీసాతో వచ్చారు. ఈ వీసాల గడువు కూడా ముగిసింది. ఢిల్లీ బేస్డ్ డ్రగ్ సప్లయర్ అయిన చిడి ద్వారా వీరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించాం. ఢిల్లీ, బెంగళూరు ల నుండి వీరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించాము. వీరికి డ్రగ్ పెడ్లర్స్ తో ఉన్న సంబంధాలు.. కస్టమర్ ఎవరు ఉన్నారనే అంశాల పై దర్యాప్తు చేస్తున్నాం. యువత , విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరో వైపు డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్ వేర్ యువకులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి రూ. 1.5 లక్షల విలువచేసే 12.6 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి బెంగళూరు నుంచి తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తోంది ఈ ముఠా. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు డ్రగ్ పెడ్లర్ హనుమంతుతో పాటు డ్రగ్ వినియోగిస్తున్న మహేష్, ఆదర్శ్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
